పులివెందుల రూరల్ : దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి పేదల డాక్టర్‌గా పులివెందుల ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆయన హస్తవాసి తగిలితే ఎంతటి రోగమైనా ఇట్టే నయమవుతుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి చిన్నపిల్లల డాక్టర్‌గా ప్రాచుర్యం పొందారు. 1949 ఏప్రిల్ 20వ తేదీన ఈసీ సిద్ధారెడ్డి, తులశమ్మ దంపతులకు రెండవ సంతానంగా వేముల మండలంలోని గొల్లలగూడూరులో ఈసీ గంగిరెడ్డి జన్మించారు. ఆయన తన విద్యాభ్యాసం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గొల్లలగూడూరు ఆర్‌సీఎం స్కూలు, 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పులివెందులలోని జెడ్పీ హైస్కూలు, 9వ తరగతి నుంచి 11వ తరగతి వరకు వేముల జెడ్పీ హైస్కూలు, అనంతరం ఎంబీబీఎస్ వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. బెనారస్ యూనివర్సిటీలో ఆయన పీడీ కూడా పూర్తి చేశారు. అనంతరం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించారు. అనంతరం పులివెందులలోని శ్రీనివాసహాలు వీధిలో తన సతీమణి డాక్టర్ ఈసీ సుగుణమ్మతో కలిసి గంగిరెడ్డి ఆసుపత్రి స్థాపించి దంపతులిద్దరూ వైద్య సేవలు అందించేవారు. పులివెందులలోని గంగిరెడ్డి ఆసుపత్రి అంటే ఎంతో ప్రాచుర్యం పొందింది. పులివెందుల ప్రాంతంలో పేదల వైద్యునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. వైద్యం చేయడమే ప్రధాన ఆశయంగా ప్రతిఫలం ఆశించని డాక్టర్‌గా ఇక్కడ గుర్తింపు పొందారు. ఎలాంటి రోగమైనా ఆయన దగ్గరకు వెళ్లి ఆయన చేయి పడితే నయమవుతుందని పులివెందుల ప్రాంత ప్రజల నమ్మకం. పులివెందుల ప్రాంత ప్రజలే కాకుండా జిల్లాలోని నలుమూలల నుంచి పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆయన వద్దకు వచ్చి రోగులు వైద్య సేవలు పొందేవారు. వైద్య సేవలలో మారుతున్న కాలాన్ని బట్టి ఆయన భాకరాపురంలో అత్యాధునిక వైద్య పరికరాలతో తన కుమారుడి పేరిట దినేష్ నర్సింగ్ హోం (ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి)ని స్థాపించి వైద్య సేవలు అందించారు. ఈసీ గంగిరెడ్డి కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి కూడా వైద్యునిగా సేవలు అందిస్తున్నారు. ఈసీ గంగిరెడ్డి తన దగ్గరకు వచ్చే రోగుల పట్ల ఎంతో ప్రేమ, ఆప్యాయతను కనబరిచే వారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు తపన పడేవారు. దినేష్ నర్సింగ్ హోం ద్వారా అనేక ఉచిత మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేశారు.
రాజకీయ ప్రస్థానం
డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2001 నుంచి 2005 వరకు పులివెందుల మండల ప్రెసిడెంట్‌గా ప్రజలకు సేవలు అందించారు. వైఎస్ కుటుంబం పోటీ చేసే ప్రతి ఎన్నికలలోనూ ఆయన తనవంతు పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో వైఎస్ కుటుంబానికి మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. 2003 రబీ సీజన్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రైతులకు విత్తనాలు సక్రమంగా సరఫరా చేయలేదని పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు.
నేడు అన్నదానం
దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఆరో వర్ధంతి కార్యక్రమం శనివారం పులివెందులలో జరగనుంది. డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో ఉన్న డాక్టర్ ఈసీ గంగిరెడ్డి ఘాట్ వద్ద డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె వైఎస్ భారతిరెడ్డి, సతీమణి ఈసీ సుగుణమ్మ, కుమారుడు ఈసీ దినేష్‌రెడ్డి, వైఎస్ కుటుంబీకులు నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం స్థానిక భాకరాపురంలో గల దినేష్ నర్సింగ్ హోంలో ప్రత్యేక ప్రార్థనలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
చిన్నపిల్లల హస్తవాసిగా ప్రాచుర్యం
రాజకీయ నాయకుడిగా తనదైన పాత్ర
నేడు దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 6వ వర్ధంతి
పాల్గొననున్న వైఎస్ కుటుంబ సభ్యులు


