మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె వద్ద శుక్రవారం ఉదయం అడవి పంది దాడి చేయడంతో నారపురెడ్డి బాలసుబ్బమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. శెట్టివారిపల్లెకు చెందిన బాలసుబ్బమ్మ కుటుంబం గ్రామ సమీపంలోని తమ పొలంలో పశుగ్రాసం సాగు చేసింది. రోజూ ఆమె పొలం వద్దకు వెళ్లి పశుగ్రాసం కోసుకొని వచ్చేది. ఆ క్రమంలో శుక్రవారం తన మనవడు సందీప్ కుమార్‌రెడ్డితో కలిసి పొలం వద్దకు వెళ్లింది. బాల సుబ్బమ్మ గడ్డి కోస్తుండగా సందీప్‌కుమార్‌రెడ్డి బహిర్భూమికి వెళ్లాడు. అతను తిరిగి పొలం వద్దకు వచ్చే సరికి బాలసుబ్బమ్మపై అడవి పంది దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచింది. అది చూసిన సందీప్ గట్టిగా కేకలు వేయడంతో.. సమీపంలోని పొలాల్లో ఉన్న మహిళలు పరుగున అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్ర రక్తస్రావంతో బాలసుబ్బమ్మ మృతి చెందింది. గడ్డి కోసుకుంటున్న బాల సుబ్బమ్మపై అడవి పంది దాడి చేయడంతో ఆమె నోరు, ముక్కు ఛిద్రమయ్యాయి. సంఘటన గురించి తెలియగానే అర్బన్ ఎస్‌ఐ కత్తి వెంకటరమణ, వనిపెంట అటవీ రేంజి డీఆర్‌ఓ అన్వర్ హుస్సేన్, బీట్ ఆఫీసర్ లింగారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాలసుబ్బమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ అన్వర్ హుస్సేన్ మాట్లాడుతూ ఒంటరిగాడు అనే అడవి పందులు మనుషుల నడుము కింది భాగాల్లో దాడి చేస్తాయని తెలిపారు. వృద్ధురాలు కూర్చుని గడ్డి కోస్తుండటంతో పంది ఆమె ముఖంపై దాడి చేసి ఉంటుందని పేర్కొన్నారు. కాగా బాలసుబ్బమ్మపై దాడి చేసింది అడవి పందా లేక ఎలుగుబంటా అనేది పోస్టుమార్టం రిపోర్టులో తెలుస్తుందని చెప్పారు. బాల సుబ్బమ్మ కుమారుడు వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


