దువ్వూరు : మండలంలోని నేలటూరు గ్రామ ఎస్సీ కాలనీలో వారం రోజుల కిందట వర్షాలకు పందిటి కదిరెమ్మ(60) అనే వృద్ధురాలి మట్టి మిద్దె కూలిపోయింది. దీంతో ఆమె విధిలేని పరిస్థితుల్లో కూలిన మట్టిమిద్దె వద్దే చెట్టు కింద జీవనం సాగిస్తోంది. గత నెల 23వ తేది రాత్రి వర్షం పడుతుండగా ఇంట్లో ఉన్నానని, ఏదో శబ్దం రావడంతో తాను బయటికి వచ్చిన వెంటనే మిద్దె కూలిపోయిందని, ప్రాణాలతో బయటపడ్డానని పందిటి కదిరెమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిపినా స్పందించలేదని, ఇంత వరకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంట్లో ఉన్న ఒక్క వస్తువు కూడా పనికిరాకుండా పోయిందని తెలిపారు. తనకు అయిన వారు ఉన్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.


