ఆటలంటే ప్రాణం.. దూరమై విషాదం | - | Sakshi
Sakshi News home page

ఆటలంటే ప్రాణం.. దూరమై విషాదం

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

ఆటలంటే ప్రాణం.. దూరమై విషాదం

జీవితంలో ఎన్నో అవకాశాలు

ప్రొద్దుటూరు క్రైం : ఆ బాలుడికి ఆటలంటే ప్రాణం.. ఖోఖో, రన్నింగ్‌ పోటీల్లో పాల్గొనాలని ఎంతో ఆసక్తి ఉండేది. అయితే గతంలో కాలికి గాయం కావడంతో ఈ సారి పరుగు పందెంలో పాల్గొనవద్దని ఉపాధ్యాయులు సూచించారు. వచ్చే ఏడాది మంచి షూస్‌ కొనిస్తానని, బాగా ప్రాక్టిస్‌ చేసి పోటీల్లో పాల్గొనవచ్చని తండ్రి భరోసా ఇచ్చాడు. అయినా ఆ చిన్నారి మనసులోని ఆవేదనను ఎవరూ అంచనా వేయలేకపోయారు. తనకెంతో ఇష్టమైన పరుగు పందెంలో పాల్గొనలేకపోయానన్న బాధతో గురువారం ప్రొద్దుటూరుకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి జింకా నాగ అజయ్‌(15) బలవన్మరణానికి పాల్పడిన ఘటన అందరినీ ఎంతగానో కలచివేసింది.

కాలు బెణకడంతో..

ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన సంజీవ్‌, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు అజయ్‌ స్థానిక మున్సిపల్‌ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. సంజీవ్‌ టీ గ్లాసులు, తినుబండారాలను దుకాణాలకు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, మరో కుమార్తె ఇంటర్‌ చదువుతోంది. అజయ్‌కి చదువుతోపాటు ఖోఖో, రన్నింగ్‌ అంటే ఎంతో ఇష్టం. గతేడాది రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కాలు బెణికింది. దీంతో ఆటల పోటీలకు దూరంగా ఉండాలని ఉపాధ్యాయులు సూచించారు.

పోటీల్లో పాల్గొనాలని ఎంతో పట్టుదల..

ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరులో స్కూల్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా ఖోఖోలో ఉత్సాహంగా పాల్గొన్న అజయ్‌.. 600 మీటర్ల పరుగు పందెంలోనూ తన సత్తా చాటాలని భావించాడు. అయితే కాలు పూర్తిగా కోలుకోలేదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు బాలుడిని పోటీలో పాల్గొనవద్దని సూచించారు. దీంతో అజయ్‌ తీవ్రంగా బాధపడినట్లు తెలిసింది. బాలుడి ఆవేదనను గమనించిన ఉపాధ్యాయుడు అతని తండ్రి సంజీవ్‌కు ఫోన్‌ చేశాడు. కాలు బాగలేదని, అయినా రన్నింగ్‌ పోటీల్లో పాల్గొంటానంటున్నాడని, నచ్చ చెప్పాలని కోరాడు. దీంతో సంజీవ్‌ తండ్రి కుమారుడితో మాట్లాడాడు. ‘కాలు బాగోలేదు కదా బాబు.. టీచర్లు కూడా వద్దంటున్నారు.. నీ ఆరోగ్యం కోసమే కదా చెబుతున్నారు.. వారి మాట విను’అని నచ్చచెప్పాడు. అంతే కాకుండా.. ‘హైదరాబాద్‌కు తీసుకెళ్లి మంచి షూస్‌ కొనిస్తాను. తర్వాత బాగా ప్రాక్టీస్‌ చేసి వచ్చే ఏడాది రన్నింగ్‌ పోటీల్లో పాల్గొందువులే’అని భరోసా ఇచ్చాడు. కుమారుడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రి.. తన బిడ్డకు ఏమీ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెప్పాడు.

సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక..

గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన అజయ్‌.. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి తిరిగి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన సమయంలో తల్లి లక్ష్మీదేవి మిద్దైపె పనుల్లో నిమగ్నమై ఉంది. కుమారుడు ఇంటికి వచ్చాడని తెలిసినా.. చవువుకుంటున్నాడమేనని భావించింది. ఇంతలోనే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అజయ్‌ బలవన్మరణానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

విషాద ఛాయలు

బాలుడి మృతితో ఈశ్వరరెడ్డినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని కలలు కన్న ఆ బాలుడు.. చిన్న వయసులోనే కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లిన ఘటన స్థానికులకు సైతం కంటతడి తెప్పించింది. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం బాలుడి మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇటీవల పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. చిన్న చిన్న కారణాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జీవితంలో అనేక అవకాశాలు, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఏ విషయాన్ని శాశ్వతం అని భావించరాదు. ఇది తాత్కాలికమే.. అని పిల్లలకు అర్థం కావాలి. ఆడలేక పోయాను, ఇక ఇలానే ఉంటానేమో అని ఆ క్షణంలో బాలుడికి ఆలోచన వచ్చి అఘాయిత్యానికి పాల్పడి వుండవచ్చు. తల్లిదండ్రులు పిల్లలతో బాగా మాట్లాడుతూ ఉండాలి. ఆటల్లో ఓడినా.. గెలిచినా తట్టుకునేలా ప్రిపేర్‌ చేయాలి.

–కవితా ప్రసన్న, మానసిక వైద్య నిపుణురాలు, జిల్లా ఆస్పత్రి, ప్రొద్దుటూరు.

రన్నింగ్‌లో పాల్గొన లేకపోవడంతో విద్యార్థి బలవన్మరణం

కాలు బెణకడంతో వద్దని సూచించిన

ఉపాధ్యాయులు

తల్లిదండ్రులు నచ్చచెప్పినా ఆలకించని అజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement