కడప ఎడ్యుకేషన్ : కడపలోని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో నాబార్డ్ ఆర్థిక సహకారంతో ఈనెల 20 నుంచి నిర్వహించే ‘మిల్లెట్లతో స్వయం ఉపాధి’ శిక్షణ కార్యక్రమానికి ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేవీకే ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మిల్లెట్లతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్, లేబులింగ్, వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఆహార భద్రత ప్రమా ణాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి బ్యాచ్‌లో 25 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుందని, మొత్తం 10 బ్యాచ్‌లకు శిక్షణ అందించనున్నామన్నారు. అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, శిక్షణ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని, వివరాలకు 7386718426 నెంబరులో సంప్రదించాలని సూచించారు.
ఎన్‌ఎంఎంఎస్‌ఫలితాల విడుదల
కడప ఎడ్యుకేషన్ : జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్) ఫలితాలు విడుదలయ్యాని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.షంషుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు సంబంధించిన మెరిట్ కార్డులు ఈనెల 12 నుంచి ప్రభుత్వ పరీక్షల కార్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర వివరాలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని ఆయన కోరారు.
ప్రతిష్టాత్మకంగా
‘స్టార్ట్‌అప్ కడప’!
కడప సెవెన్‌రోడ్స్ : యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘స్టార్ట్‌అప్ కడప’ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ దేశానికే ఆదర్శంగా నిలవనుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘స్టార్ట్‌అప్ కడప’’నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావనతో కలిసి పరిశీలించారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈ ఏడాది జిల్లాస్థాయి ఉపాధ్యాయ పురస్కారం కోసం జిల్లా స్థాయిలో అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షంషుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు కనీసం 10 సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉండాలన్నారు. దరఖాస్తుల గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా ఉపాధ్యాయులను సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న సన్మానించనున్నట్లు డీఈఓ వివరించారు.
అర్జీల పరిష్కారంలో జాప్యం తగదు!
కడప సెవెన్‌రోడ్స్ : ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించడంతో పాటు పెండింగ్ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని మండలాల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో రెవెన్యూ, ప్రజా సేవలకు సంబంధించి 12 ప్రధాన ప్రమాణికాల్లో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, భూసర్వే పునఃపరిశీలన, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, భూముల బదలాయింపులు, 22–ఏ కేసులు, చుక్కల భూములు, భూసేకరణ, ప్రభుత్వ భూముల కేటాయింపు, ఐవీఆర్‌ఎస్, ఇతర సామూహిక సమస్యలు, జెడ్‌హెచ్‌డీసీ భూములు, ఆన్‌లైన్ రెవెన్యూ రికార్డులు, భూముల డిజిటలీకరణ తదితర అంశాలపై మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్‌లో ఉన్న దశలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. 22–ఏ జాబితాలో తప్పుగా నమోదైన భూములను నిబంధనల ప్రకారం పరిశీలించి సరిదిద్దాలని ఆదేశించారు. రాజోలి జలాశయ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో పరిహారం చెల్లింపుల కోసం నిధుల అవసరంపై ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిన వివరాలను కూడా సమావేశంలో పరిశీలించారు.


