● పట్టించుకోని కార్పొరేషన్ యంత్రాంగం
చింతకొమ్మదిన్నె : మండల పరిధి నుంచి కడప నగర కార్పొరేషన్‌లోకి విలీనమైన మేరీనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో పందులు యథేచ్ఛగా సంచరిస్తూ.. చిన్నారులపై దాడులు చేస్తున్నా కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చింతకొమ్మదిన్నె మండల కార్యదర్శి మడగలం ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశశారు. పందుల వల్ల ప్రజలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని, వాటిని నివాస ప్రాంతాల నుంచి తరలించాలని ఆయన కోరారు. ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న కార్మికుడైన సందీప్ కుమారుడిపై పందులు ఇటీవల చేయడంతో.. కాలి బొటన వేలు కోల్పోయి రిమ్స్‌లో చికిత్స పొంది ఇంటికి వచ్చాడన్నారు. ఆ బాలుడిని స్థానికులతో కలసి మంగళవారం పరామర్శించిన సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పలు నివాసిత ప్రాంతాల్లో మనుషుల కంటే పందులే అధికంగా ఉన్నాయని, గత కొంత కాలంగా తరచూ మనుషులపై, ముఖ్యంగా చిన్నపిల్లలపై దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఒక బాలుడిపై, అలాగే రిమ్స్ హాస్పిటల్‌లోని వన్‌స్టాప్ సెంటర్ మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసి గాయపరిచాయన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే వీటిని ఊరి నుంచి తరలించాలన్నారు.


