డీఆర్వో మల్లికార్జునుడు
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మల్లికార్జునుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌లో కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, డీపీవో రామచంద్ర, మున్సిపల్ కమీషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను చక్కటి ప్రణాళికతో నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికలకు సంబంధించిన సామగ్రి, ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ తదితర ప్రక్రియలను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి, 21, 22 తేదీల్లో ఓటర్ల జాబితాల్లో గుర్తించనున్నారు. 23న ముసాయిదా జాబితా ప్రచురించి, 24 నుంచి 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27 నుంచి 31 వరకు అభ్యంతరాలపై విచారణ నిర్వహించి, సెప్టెంబరు 1 నుంచి 4 వరకు గ్రామసభల్లో జాబితాలను ధ్రువీకరిస్తారని, అలాగే సెప్టెంబరు 5న తుది జాబితాను ప్రచురిస్తారన్నారు. ప్రతి పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు అధికారిని నియమించి, ఇతర శాఖల జాబితాలతో వివరాలను సరిపోల్చి పరిశీలించాలని డీఆర్వో సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసి, నిర్ణీత గడువులో తుది జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.


