
ఇద్దరు ఘరానా దొంగల అరెస్టు
కడప అర్బన్ : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 383 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కడప రవీంద్ర నగర్‌కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్, కడప నగరం బాచరావు వీధికి చెందిన షేక్ ఇబ్రహీం ఖలీలుల్లా గతంలో సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. చోరీలకు పాల్పడిన నాలుగు ఘటనల్లో నిందితులు నేరాన్ని అంగీకరించారని తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో ఒక ఇంటిలో ఇద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడగా, సయ్యద్ ఇర్ఫాన్ రవీంద్రనగర్, మురాదియానగర్ ప్రాంతాల్లోని రెండు ఇళ్లలో బంగారు, వెండి వస్తువులను దొంగిలించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 43 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు, 340 గ్రాముల బరువు గల వెండి వస్తువులు, రూ. 30,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళవారం తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులోని నానాపల్లి క్రాస్ రోడ్డులో సయ్యద్ ఇర్ఫాన్, షేక్ ఇబ్రహీమ్ ఖలీలుల్లాను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన చిన్నచౌక్ ఇన్‌స్పెక్టర్ ఓబులేసు, ఎస్‌ఐలు రాజరాజేశ్వరరెడ్డి, రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాదర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, ఓబులేసు, సుధాకర్ యాదవ్, మాధవరెడ్డి, రంతుబాషాలకు రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నామని తెలిపారు.
383 గ్రాముల బంగారు,
వెండి ఆభరణాలు స్వాధీనం