
మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనంతో జిల్లాలోని ఐదు మండలాల్లో గురువారం స్వల్పంగా వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోపవరంలో 0.2 మి.మీ, చాపాడులో 1.6 , బద్వేల్‌లో 1.8 , చక్రాయపేట, జమ్మలమడుగులలో 2.2 మి.ఈమీ వర్షపాతం నమోదైంది.
కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ వద్ద ఉన్న ప్రభుత్వ మైనార్టీ ఐటీఐలో మూడవ విడత అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జ్ఞానకుమార్ తెలిపారు. పదో తరగతి పాస్, పెయిల్, ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన, ఆపై అర్హతలు ఉన్న విద్యార్థులు అర్హులని తెలిపారు. సీటు కోసం అభ్యర్థులు తమ 10వ తరగతి మార్కుల జాబితా, టీసీ, కుల ధ్రువీకరణపత్రం, ఆధార్, ఫొటో, మెయిల్ ఐడీతో ఐటీఐలో సంప్రదించాలని సూచించారు. ఈ నెల 26లోగా దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు. ఆగస్ట్ 29న అడ్మిషన్ కౌన్సెలింగ్ ఉంటుందని వివరించారు.
కడప కార్పొరేషన్: కడప నగరంలోని నేక్‌నామ్ కళాక్షేత్రంలో ఈ నెల 22, 23, 24 తేదీలలో టాయ్ కార్స్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు రాహిల్‌తాజ్ తెలిపారు. ఇందులో రూ.3 వేలు, రూ.5వేలు, రూ.7వేలు విలువజేసే కార్లు ఉంటాయని, రూ.35వేలు విలువజేసే కారు కేవలం రూ.20వేలకే విక్రయిస్తామన్నారు. ప్రతి వెయ్యి రూపాయల చెల్లింపునకు ఒక స్క్రాచ్ కార్డు ఇస్తామని, అందులో కనీసం రూ.100ల నుంచి రూ.1000 వరకూ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉన్నాయన్నారు. ఉదాహరణకు రూ.3,500 విలువ చేసే కారు కొంటే మూడు స్క్రాచ్ కార్డులు, రూ.20వేల కారు కొంటే ఇరవై స్క్రాచ్ కార్డులు ఇస్తామని రాహిల్ తాజ్ అన్నారు. ఆయా కార్డులను స్క్రాచ్ చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ వస్తే అంతపోను మిగిలిన మొత్తం చెల్లిస్తే సరిపోతుందన్నారు. అరుదుగా లభించే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కడప సెవెన్‌రోడ్స్: మైనార్టీ సంక్షేమశాఖలో 2015 నుంచి జరిగిన నిధుల గోల్‌మాల్‌పై ఆ శాఖ జిల్లా అధికారి హిదాయతుల్లా వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారితోపాటు జూనియర్ అసిస్టెంట్ మస్తాన్‌వలీ రూ. 2.48 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలు వచ్చాయి. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ విచారణ నిర్వహించారని వెల్లడించారు. నిధుల దుర్వినియోగం విషయం ప్రాథమికంగా రుజువైందని తెలిపారు. నిధులు ఎవరెవరికి అందాయనే పూర్తి సమాచారం సమగ్ర విచారణ ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. నివేదికను తమ శాఖ ఉన్నతాధికారులకు పంపామని తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అదే యాజమాన్యాలలో అంతర్‌జిల్లా బదిలీలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అనుమతి ఇచ్చారని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. 2025 జులై 31 నాటికి రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఈ అంతర్‌జిల్లా బదిలీలకు ఈ నెల 24వ తేదీ వరకు ‘లీప్’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అంతర్‌జిల్లా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు, అవసరమైయిన ప్రొఫార్మాలు అన్ని వైఎస్‌ఆర్ కడప జిల్లా అంతర్జాలం www.kadapadeo.in నందు ఉంచినట్లు డీఈఓ తెలిపారు.
కడప రూరల్: ఎస్సీలకు భారీ మోటర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. అభ్యర్థులు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారై, 20 నుంచి 40 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలన్నారు. లైట్ మో టార్ వెహికల్ లైసెన్స్ కలిగి, హెచ్‌ఎంవీ కోసం ఎల్‌ఎల్‌ఆర్ కలిగి ఉండాలని తెలిపారు. హెవీ మోటార్ వెహికల్ ఎల్‌ఎల్‌ఆర్ కోసం రూ.210, లైసెన్స్ కోసం రూ.1060 అభ్యర్థులే చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం అర్హులైన వారిని పదిమందిని ఎంపిక చేసి అందులో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలకు ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్ ఆధ్వర్యంలో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 27వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు నమూనాలను జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం, డి బ్లాక్, నూతన కలెక్టరేట్, కడప అనే చిరునామాలో పొందవచ్చు అన్నారు.