
పింఛన్లు తొలగించే కుట్ర
పోరుమామిళ్ల: దివ్యాంగ పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ హామీని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్న పెన్షన్లను తొలగించే పనిలో పడిందని మండిపడ్డారు. తొలివిడతగా దివ్యాంగ, ఆరోగ్య పెన్షన్లపై కన్నేసిందన్నారు. ఇందులో భాగంగానే పది, పదిహేనేళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు సైతం మళ్లీ సదరం సర్టిఫికెట్ల్ల కోసం దరఖాస్తు చేసుకుని, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని... ఇప్పుడు వైకల్యం శాతం 40 కంటే తగ్గిందన్న సాకుతో చాలా మంది పెన్షన్లను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దివ్యాంగులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిందిపోయి వారి బతుకులతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. వారిపై ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అప్పుడు అర్హులు ఇప్పుడు అనర్హులా అని ఆయన నిలదీశారు. అప్పటి సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.200లు పెన్షన్ తీసుకున్న వికలాంగులు ఇప్పుడు అర్హత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పుడు, ఇప్పుడూ రెండుసార్లూ తనిఖీలు చేసింది వైద్యులే కదా, ఇప్పుడు అంగవైకల్యం తగ్గిందని ధృవీకరిస్తున్న ఈ డాక్టర్లది తప్పా లేక అప్పుడు ఇచ్చిన వైద్యులది తప్పా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారన్నారు. వైకల్యశాతం తక్కువ, తాత్కాలిక వైకల్యం కారణంగా పెన్షన్ నిలిపివేయనున్నట్లు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల నుంచి నోటీసులు అందచేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నోటీసులు అందుకున్న వారు అర్హులుగా భావిస్తే తమ వివరాలను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో అప్పీలు చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తుది నిర్ణయం తీసుకుని దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి