
●విద్యుత్ భద్రతా నియమాలు పాటించాలి
కడప కార్పొరేషన్: వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రజలు విద్యుత్ భద్రతా నియమాలను విధిగా పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ కోరారు. గురువారం విద్యుత్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినాయక పందిళ్లను విద్యుత్ లైన్లకు సమీపంలో వేయరాదని, దీనివల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. భారీ విగ్రహాలతో ఊరేగింపులు చేసేటప్పుడు విద్యుత్ లైన్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే విద్యుత్తు సిబ్బంది సహకారం తీసుకొని విద్యుత్‌ను ఆఫ్ చేయించుకొని ముందుకు సాగాలన్నారు. విద్యుత్ భూతంతో సమానమని చిన్న తప్పిదమే పెను విషాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వినాయక పందిళ్లకు ఉపయోగించే విద్యుత్ వైర్లను అతుకులు లేకుండా, నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించాలన్నారు.విద్యుత్తు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పందిళ్లు ఏర్పాటు చేయకూడదన్నారు. డెకరేషన్ లైట్లు కట్టుకొనుటకు ఇనుప పైపులు, కడ్డీలు వాడరాదని, కొయ్యలు, ప్లాస్టిక్ పైపులు వాడాలన్నారు. సూచనలు, విద్యుత్ భద్రతా నియమాలను పాటించి వినాయక చవితి ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.