కడప సెవెన్‌రోడ్స్: సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు ఒక చిహ్నమే గాక ఖర్చుకూడా తగ్గి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రజలు వినా యకుని పండుగను పర్యావరణానికి అనుకూలంగా. జరుపుకోవాలని సూచించారు. మన చెరువులు,జలవనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గించాలన్నారు. చెరువులు, సరస్సులు జలాశయాలు, జీవరాశుల మనుగడ ముఖ్యమని వాటి సంరక్షణ మనందరి బాధ్యత అన్నారు. వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, విషపదార్థాల వినియోగం వల్ల జలవనరులు కాలుష్యానికి గురవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మట్టితో తయారుచేసిన వినాయకుని ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు.
మట్టి గణపతితో పర్యావరణానికి మేలు:
జేసీ అదితిసింగ్
వినాయక చవితి పండుగకు మట్టి విగ్రహాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఈ అంశంపై డీవైఎఫ్‌ఐ రూపొందించిన వాల్‌పోస్టర్లను తన చాంబర్‌లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వల్ల నీటి కాలుష్యం అధికంగా జరిగే ప్రమాదముందన్నారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని, వీరనాల శివకుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహా, సహాయ కార్యదర్శి ఆదిల్, నగర కార్యదర్శి విజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి