
సేవలు సంతృప్త స్థాయిలో అందాలి
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై గురువారం చీఫ్ సెక్రటరీ విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సక్రమంగా సేవలు అందుతున్నాయా? లేదా? అనే విషయమై అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రతివారం సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ద్య కార్యక్రమాలను పటిష్టంగా జరిగేలా చూడాలన్నారు. స్వచ్చాంధ్ర అవార్డులను సాధించేందుకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ఇసుక సేకరణ సాధ్యం కాదని.. ఇప్పటినుంచే అవసరమైన మేర నిల్వలు పెంచుకోవాలని కోరారు. భూగర్బ జల వనరులను పెంపొందించుకోవడంతోపాటు సమ్మ ర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నింపే చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, సీపీఓ హజరతయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.