
గండి క్షేత్రం.. జనసంద్రం
చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి భక్తులతో కిక్కిరిసి పోయింది. శ్రావణ మాసం మూడవ శనివారోత్సవం సందర్భంగా జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లు భక్తులతో రద్దీగా మారాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పోలీసులు అద్దాలమర్రి క్రాస్, ఇడుపుల పాయ క్రాస్‌ల వద్దనే వాహణా లను నిలిపి వేశారు. వృద్ధులు, మహిళల కోసం వేంపల్లె ప్రైవేట్ పాఠశాలల వారు ఉచితంగా వ్యాన్‌లు ఏర్పాటు చేశారు. కొందరు వేంపల్లె చక్రాయపేట,నాగలగుట్టపల్లె, వేముల తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ సహాయకమీషనర్ వెంకటసుబ్బయ్య చైర్మన్ కావలి కృష్ణతేజ పాలకమండలి సభ్యులతో పాటు,ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య,ఆర్కేవ్యాలీ ఎస్సై రంగారావు ఆద్వర్యంలో సుమారు 200 మంది పోలీ సులు బందో బస్తు నిర్వహించారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, అర్చకులు కేసరి,రాజారమేష్, అర్చకులు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు.
ఏర్పాట్లలో విఫలం.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ తగు ఏర్పాట్లు చేయడంలో అదికారులు విఫలమయ్యారు. క్యూలైన్ల వద్ద తొక్కిసలాట జరిగింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ వర్గాలకు సంబంధించి వచ్చిన బంధుమిత్రులకే ఇక్కడ రాచ బాటలు ఉన్నాయని విధులకు వచ్చిన వారికి అవమానాలే దక్కుతున్నాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు

గండి క్షేత్రం.. జనసంద్రం