
బాబు మెప్పు కోసమే టీడీపీ నేతల కుట్రలు
పులివెందుల: ఎంతోమందికి వైఎస్సార్ కుటుంబం రాజకీయ బిక్ష పెట్టిందని, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో మార్పు ప్రారంభమవుతుందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు మెప్పు పొందడం కోసం టీడీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ‘తలకాయలు లేచిపోయేవి కదా’.. అంటూ ఎందుకు మాట్లాడుతున్నారు అని ప్రజలు ఆలోచించాలన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నామని, రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని చెప్పడం కోసమో...తెలుగుదేశం పార్టీ బాగుందనో ప్రజలను నమ్మించడానికి నానా పాట్లూ పడుతున్నారన్నారు. వాళ్లు ఎన్ని చేసినా ప్రజలు వైఎస్ కుటుంబం చేసిన మంచిని మరిచిపోరన్నారు. ఇన్ని రోజులు వైఎస్ కుటుంబం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడిందని, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలబడాల్సిన టైం వచ్చిందని.. కచ్చితంగా బలంగా నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందుల ప్రాంత ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినదని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుస్తామని అవతలి వాళ్లకు అంత నమ్మకం ఉంటే శాంతియుత వాతావరణంలో సీసీ కెమెరాల నీడలో ఎన్నికలను నిర్వహించాలని అధికారులకు విన్నవించాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి