
సెల్‌ఫోన్లను వెనక్కి ఇచ్చిన అంగన్‌వాడీలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జిల్లాలోని కడప అర్బన్ పరిధిలో అంగన్‌వాడీలు సెల్ ఫోన్లను సీడీపీఓలకు వెనక్కి ఇచ్చినట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, జిల్లా కోశాధికారి ఎంపీ అంజలీదేవి తెలిపారు. ఈ మేరకు సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రదర్శనగా వచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ చాలా నెలలుగా సెల్ ఫోన్లు పనిచేయడం లేదన్నారు. అయినప్పటికీ ఐసీడీఎస్ అధికారులు స్పందించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సెల్‌ఫోన్లు వెనక్కి ఇచ్చామన్నారు. ఐసీడీఎస్ అధికారులు వెంటనే కొత్త సెల్‌ఫోన్‌లను ఇచ్చి మ్యాపుల పేరుతో భారం తగ్గించి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాంతి. వెంగమాంబ, వినీల, భారతి. కవిత, సుమలత, ఉదయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి
కలికిరి : ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం కలికిరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... కేవీ పల్లి మండలం నూతనకాల్వ గ్రామం దిండువారిపల్లికి చెందిన చింతపర్తి మంగమ్మ(82) కలికిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా కలికిరి పట్టణానికి చెందిన సుబహాన్ ఆటోతో ఢీకొన్నాడు. ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మంగమ్మ కుమార్తె రామ కుమారి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవరుపై కేసు నమోదు చేశారు.