
టీడీపీ నేత భూ ఆక్రమణలపై ఆర్డీఓకు ఫిర్యాదు
బద్వేలు అర్బన్ : పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్, టీడీపీ నాయకుడు చెరుకూరి వీరచెండ్రాయుడు భూ ఆక్రమణలపై పోరుమామిళ్లకు చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణరెడ్డి సోమవారం ఆర్డీఓ ఎ.చంద్రమోహన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కమ్మవారిపల్లెకు చెందిన టీడీపీ నేత వీరచెండ్రాయుడు తన అధికార బలంతో రాత్రికి రాత్రే రికార్డులు తారుమారు చేసి దాదాపు వంద కోట్లు విలువ చేసే భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రంగసముద్రం రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 75 లో దాదాపు రూ.5 కోట్లు విలువ చేసే 3.22 ఎకరాల భూమిని 2017లో అసైన్‌మెంట్ కమిటీలో డీకేటీ పట్టాలు పొందినట్లు చూపుతున్నారని, అసలు అసైన్‌మెంట్ కమిటీలో భూమి పొందేందుకు ఆయన ఎలా అర్హుడయ్యారో సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఇదే గ్రామ పొలంలోని సర్వే నెంబర్ 419 లో 74 సెంట్లు, 432 లో 94 సెంట్లు అనువంశికం కింద ఆన్‌లైన్‌లో ఎక్కించారని, ఆ భూమి ఆయనకు అనువంశికం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే పోరుమామిళ్ల పట్టణంలోని సుందరయ్యకాలనీకి దక్షిణ భాగాన ఉన్న సర్వే నెంబర్ 136–5 లో మాజీ సైనికోద్యోగి నాగరాజు పేరుతో ఆర్మీ కోటాలో భూమి పొందారని, ఇది అధికారులను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. జిల్లా అధికారులు స్పందించి టీడీపీ నేత భూ ఆక్రమణలపై విచారణ జరిపించాలని కోరారు.