
టీడీపీ నాయకులు బలవంతంగా కండువాలు వేశారు
పులివెందుల : సోమవారం ఉదయం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పులివెందుల మండలం అచ్చివెల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన నాగేంద్ర, జయరాం, గంగాధర్, రామకృష్ణ, రోబో గంగాధర్, దేవుడు, గంగరాజు, ఓబులేసులు కలిశారు. ఈ సందర్భంగా ఎంపీతో వారు మాట్లాడుతూ ఆదివారం తమను తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు తమ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా బలవంతంగా టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లుగా సృష్టించారు. మేము స్వచ్ఛందంగా టీడీపీలో చేరలేదని, తాము ఎప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని ఆయనకు తెలిపారు. అలాగే తమకు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి తమకు ఆదివారం పట్టిన దోషాన్ని తొలగించాలని ఎంపీని కోరారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వారికి వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో ఎన్నో ఆరాచకాలు, బెదిరింపులు, అక్రమ కేసులు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అలాంటి వాటికి లొంగక దీటుగా ఎదుర్కొంటారన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డి పాల్గొన్నారు.