
ఉత్సాహంగా జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ 14, 16 బాలబాలికల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరికి 60 మీటర్లు, 600 మీటర్లు పరుగు పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్‌పుట్, జావెలిన్‌త్రో ట్రయథ్లాన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 30 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ కార్యదర్శి వై.అహ్మర్ బాషా తెలిపారు. వీరు ఈనెల 9, 10, 11వ తేదీల్లో బాపట్లలో జరిగే ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. వ్యాయామ సంచాలకులు నాగూర్ బాషా, శివారెడ్డి, ఎర్రన్న, శంకర్, నరేష్, చందు, నాగేశ్వరరావు, ఖాదర్‌రెడ్డి, దిలీప్, కోచ్ వివేకానందరెడ్డి, రబ్బాని, భార్గవ్ అథ్లెటిక్స్ పోటీల నిర్వహణలో సహకరించారన్నారు.