
నాటక రంగానికి బళ్లారి రాఘవ విశిష్ట సేవలు
జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్ నీలమయ్య
కడప సెవెన్‌రోడ్స్ : తెలుగు నాటక రంగానికి కళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ విశిష్ట సేవలు అందించారని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జీఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ కలెక్టర్ నీలమయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో స్టెప్, జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బళ్లారి రాఘవ 145వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నాటక రంగానికి ఎనలేని కృషి చేసిన బళ్లరి రాఘవ స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమన్నారు. ఆయన చిన్నతనం నుంచి కళలపై మక్కువ చూపించారన్నారు. న్యాయవాదిగా ఆయన చేసిన ప్రజా సేవకుగాను బ్రిటీష్ ప్రభుత్వం రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించిందన్నారు. ఆయన ఎక్కువగా సామాజిక నాటకాలను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలు, రుగ్మతలపై ప్రదర్శనలు నిర్వహించి నాటక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. మహిళలను కూడా ఆయన నాటక రంగంలో ప్రోత్సహించారన్నారు. ఇంగ్లాండ్,ఫ్రాన్స్ ,జర్మనీస్ స్విట్జర్లాండ్, శ్రీలంక వంటి దేశాలలో ఆయన నాటక ప్రదర్శనలు చేసి విదేశీయుల మన్ననలు పొందారన్నారు. 1936లో సినిమా రంగంలోకి ప్రవేశించి సామాజిక మార్పులపై సినిమాలు నిర్మించారన్నారు. దళితుల కోసం ఆయన రాత్రిపూట పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. కుల వివక్షతను తీవ్రంగా వ్యతిరేకించి సామాజిక సమానుత్వానికి పాటుపడ్డారని సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ ఒక మార్గదర్శకుడుగా జీవించారన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శాంతమ్మ, స్టెప్ సీఈఓ సాయి గ్రేస్, ఎల్‌డీఎం జనార్దన, జిల్లా టూరిజం మేనేజర్ రామ్ కుమార్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.