
ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులకు అపార అవకాశాలు
పులివెందుల టౌన్ : బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం.మాధవ తెలిపారు. శనివారం స్థానిక ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని తన చాంబర్‌లో ఆయన మాట్లాడుతూ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ ప్రోగ్రాంలో చేరేందుకు ఫార్మర్స్ కోటా, నాన్ ఫార్మర్స్ కోటాలో బైపీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఈనెల 6వ తేదీ వరకు, ఎంపీసీ విద్యార్థుల నుంచి ఫార్మర్స్ కోటాలో దరఖాస్తులను ఈనెల 7వ తేదీవరకు ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిదాయలయం ద్వారా స్వీకరిస్తారన్నారు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వెబ్ సైట్ నుంచి వివరాలు పొందవచ్చని తెలిపారు. పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అందుబాటులో ఉందన్నారు. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ ప్రోగ్రాంలో చేరేందుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు పులివెందుల కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలను ఎంచుకోవాలని సూచించారు. గత ఏడాది ఈ కళాశాల నుంచి ఉత్తీర్ణులైన ఎక్కువమంది విద్యార్థులు వివిధ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందారని, కొందరు దేశ, విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రోగ్రాంలో చేరారన్నారు. ఈ ఫుడ్ టెక్నాలజీ కోర్సు అభ్యసించిన వారికి ఆహార అనుబంధ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్(https://angrau. ac.in) చూడాలని కోరారు. పులివెందులలో ఫుడ్ టెక్నాలజీ డిగ్రీ ప్రోగ్రాంలో చేరేందుకు ఆసక్తి ఉన్నవారు 9177776692 అనే ఫోన్ నంబర్‌లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.