ఉపాధి హామీ అక్రమాలపై విచారణ జరపాలి
కడప సెవెన్‌రోడ్స్/పులివెందుల : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు.
బుధవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి ఈ మేరకు ఆయన లేఖ రాశారు. జిల్లాలో లేని వారికి, అధికార పార్టీ నాయకులకు చెందిన అనుచరులకు ఫేక్ జాబ్‌కార్డులు జారీ చేస్తున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన కూలీలను విస్మరిస్తున్నారని తెలిపారు. అటెండెన్స్ రికార్డుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు. ఒకే ఫొటోలను మస్టర్‌లో ఇతర పేర్లతో పొందుపరుస్తున్నారని తెలిపారు. పనులు చేపట్టకపోయినప్పటికీ వేతనాలు విడుదల చేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా తరచూ ఇలాంటి పేమెంట్లను విడుదల చేస్తున్నారని ఆరోపించారు. కువైట్ వంటి ఇతర దేశాల్లో నివసిస్తున్న వారి పేర్లను కూడా మస్టర్ రోల్స్‌లో చూపుతున్నారని పేర్కొన్నారు. సామాజిక తనిఖీ యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యమైందని, ఇలాంటి అవకతవకలను వెలికి తీయడంలో విఫలమైందన్నారు. చక్రాయపేట మండలం కుప్పం పంచాయతీ పరిధిలో ఉపాధి పనుల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఫేక్ ఎంట్రీస్, ఒకే విధమైన ఫొటోలు, తప్పుడు మస్టర్లు వంటివి నిత్యకృత్యమయ్యాయన్నారు. ఉపాధి హామీ మస్టర్ రోల్స్, జాబ్‌కార్డు రికార్డులు, వేతన పంపిణీ అంశాల్లో గత మూడేళ్లుగా చోటుచేసుకున్న అక్రమాలపై తక్షణమే జిల్లా స్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు. ఉపాధి పనుల అవకతవకలకు కారణమైన పంచాయతీ సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయాలని కోరారు. స్వతంత్ర విచారణ కమిటీని నియమించి థర్డ్ పార్టీ అబ్జర్వర్లను కూడా అందులో నియమించాలన్నారు. ప్రస్తుతం పూర్తయిన, జరుగుతూ ఉన్న పనులపై రీ ఆడిట్ నిర్వహించాలన్నారు. సోషల్ ఆడిట్ టీములను పునరుద్ధరించాలన్నారు. సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖకు సమర్పించి ఉపాధి హామి పనుల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
కలెక్టర్‌కు ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ


