నేడు సమావేశం
కడప అగ్రికల్చర్ : కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రక్షిత సాగుపై షేడ్ నెట్ – పాలీ హౌస్‌ల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్ తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులు పాల్గొనాలని కోరారు.
కడప సెవెన్‌రోడ్స్ : ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకు అత్యవసర సమయాల్లో సహాయం అవసరమైనపుడు టోల్ ఫ్రీ నెంబరు 1098కు డయల్ చేయవచ్చని ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.విశ్వేశ్వరనాయుడు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి జేసీ మాట్లాడుతూ బాలల సహాయవాణి 1098 అనేది భారతదేశంలో 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉండే ఉచిత అత్యవసర టోల్ ఫ్రీ సేవ అని,ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకు సహాయం అవసరమైనప్పుడు ఏ పిల్లవాడైనా ఈ నంబర్‌కు డయల్ చేయవచ్చన్నారు. వైద్య సహాయం, ఆశ్రయం, ఆహారం, కౌన్సెలింగ్, రక్షణ వంటి సేవలు అందుతాయన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమం, మహిళా సాధికారిత అధికారి పి.రమాదేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు బాల్య వివాహాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు.
నేడు హుండీ ఆదాయం లెక్కింపు
చింతకొమ్మదిన్నె: మండలంలోని కొత్తపేట సమీపంలో వెలసిన శ్రీ గంగమ్మ ఆలయంలో దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పాలక మండలి సమక్షంలో మంగళవారం ఉదయం 10 గంటలకు దేవస్థానం శాశ్వత హుండీల ఆదా యం లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యం.క్రిష్ణనాయక్ తెలిపారు.
జమ్మలమడుగు రూరల్ : తప్పు చేసి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న పేద ఖైదీలు ఎవరైనా ఉంటే ఉచిత న్యాయ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్ జైలును ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలులో ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
కడప కార్పొరేషన్: ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తున్నామని ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్. రమణ తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ఎస్. రమణ అన్నారు. సోమవారం విద్యుత్ భవన్‌లో ఆయన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమంలో పాల్గొని వినియోగదారులు ఫోన్ ద్వారా తెలిపే సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 9 మంది వినియోగదారులు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను తెలిపారని పేర్కొన్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుసూదన్, డీఈఈలు మోహన్, నాగమునిస్వామి, జేఈ సుధీర్ పాల్గొన్నారు.
రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగిస్తూ మదనపల్లె జిల్లా కేంద్రంలో కలుపుతున్నట్లు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటిలో ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు పాల్గొని సంఘీభావవాన్ని తెలిపారు. రాయచోటిలోని శివాలయం చెక్‌పోస్టు నుంచి సాగిన ర్యాలీ జూనియర్ కళాశాల, నేతాజీ సర్కిల్, బస్టాండు రోడ్డు, వైఎస్‌ఆర్ సర్కిల్ మీదుగా తిరిగి బంగ్లా సర్కిల్‌కు చేరుకుంది. నేతాజీ సర్కిల్లో మానవహారం చేపట్టి మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అన్ని విధాలుగా వెనుకపడిన రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు.


