వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి
కడప సెవెన్‌రోడ్స్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఏకాదశి సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉత్తర ద్వారంలో దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇందుకు తగ్గట్లు అధికారులు భారీ క్యూలైన్లు, చలువ పందిళ్లు, షామియానాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి వారిని కొలువుదీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాన్ని వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. రాత్రి 1.30 నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు ఉత్తర ద్వారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఉత్తర ద్వార దర్శనం వద్ద రూ.10 టిక్కెట్లు లేదంటే ఉచిత దర్శన ఏర్పాట్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక మూలవర్ల దర్శనం కోసం వెళ్లే భక్తులు రూ. 25, రూ.10 టిక్కెట్లు కొనుగోలు చేసి వెళ్లవచ్చు. అలాగే నగరంలోని గడ్డిబజారు శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయంతోపాటు ఇతర వైష్ణవాలయాల్లో ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని విశేష ఏర్పాట్లు చేశారు.


