రాజధాని పేరుతో రైతుల ఉసురు తీస్తున్న ప్రభుత్వం
పులివెందుల : రాజధాని నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం బలవంత భూసేకరణకు పాల్పడుతూ అమాయక రైతుల ప్రాణాలను తీస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దుయ్యబట్టారు. పులివెందుల భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇటీవల అమరావతికి చెందిన రామారావు అనే రైతు ల్యాండ్ పూలింగ్‌పై నిర్వహించిన సభలో ఇప్పటికే రాజధాని పేరుతో తనకున్న రెండెకరాలు ఇచ్చానని, ఇప్పుడు ఇంటిని కూడా అడుగుతున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర ఆవేదనతో గుండె పోటుతో మరణించారన్నారు. రైతుల భూములనే కాకుండా వారి ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం వదలడం లేదంటే ఎంత దుర్మార్గమో ప్రజలు ఆలోచించాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఏపీఐఐసీ భూములను సైతం చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను చంద్రబాబు తన లబ్ధి కోసం ప్రైవేట్‌పరం చేయడం దారుణమైన విషయమన్నారు. ఎన్నికలప్పుడు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పీడించడమే పనిగా ఈ ప్రభుత్వంలోని నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు నేతల అనైతిక కార్యకలాపాలను గమనిస్తున్నారని, వారే తగిన విధంగా చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


