పంచాయతీ కార్మికులకు అడ్వాన్సుగా రూ.10.30 లక్షలు
వేంపల్లె : వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వైఎస్సార్‌సీపీ సర్పంచ్ ఆర్.శ్రీనివాసులు తన సొంత నిధులను అడ్వాన్సుగా రూ.10.30లక్షలను అందజేశారు. పంచాయతీ ఈఓ సెలవుపై వెళ్లడంతో గత ఐదు నెలలుగా పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో వేంపల్లె గ్రామ పంచాయతీకి ఇన్‌చార్జిగా ఉన్న పులివెందుల డీఎల్‌పీఓ రమాదేవి సర్పంచ్ ఇచ్చిన రూ.10.30 లక్షలలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 103 మందికి అందజేశారు. దీంతో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. గత పది రోజుల క్రితం విధుల్లోకి చేరిన ఈఓ రామసుబ్బారెడ్డి తన సొంత పనుల కోసం సెలవుపై వెళ్లారు. అయితే ఆయన ఈనెల 26వ తేదీన విధుల్లోకి వస్తారని డీఎల్‌పీఓ తెలిపారు. ఈఓ విధుల్లోకి వచ్చిన అనంతరం సర్పంచ్‌కు రూ.10.30లక్షలను చెల్లిస్తామని తెలిపారు.


