శ్రీరాముడి జీవితం ఆదర్శం
– డీఈఓ డాక్టర్ షంషుద్దీన్
కడప ఎడ్యుకేషన్ : ప్రతి ఒక్కరూ శ్రీ రాముని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని, సన్మార్గంలో నడవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్. షంషుద్దీన్ సూచించారు. కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్‌లో పదవ తరగతి ప్రశ్నా పత్రాలను మూల్యాంకనం చేస్తున్న ఉపాధ్యాయులకు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ రామయ్య చిట్స్ వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పానకం, వడపప్పు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుషులంతా ఈర్ష్య, అసూయ, ద్వేషాలను విడనాడి ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా జీవించాలన్నారు. పానకం, వడపప్పు పంపిణీకి ఆర్థిక సహకారం అందించిన శ్రీ రామయ్య చిట్స్ నిర్వాహకులు కళావతి, రమేష్ దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి రాజగోపాల్ రెడ్డి, కడప ఎంఈఓ గంగిరెడ్డి, డీఈఓ కార్యాలయ సూపరింటెండెంట్ బాదుల్లా, ఆపస్ నాయకులు పోగుల వెంకట్రామిరెడ్డి, సుబ్బరాయుడు, దేవిరెడ్డి కొండారెడ్డి, మిట్టా కేశవరెడ్డి, పీఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్ రెడ్డి, ఎస్‌ఎల్‌టీఏ నాయకులు అంకాల్ కొండయ్య, గిరిబాబు, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


