ఏం మామా.. బాగుండావా ? | - | Sakshi
Sakshi News home page

ఏం మామా.. బాగుండావా ?

Jan 15 2026 10:44 AM | Updated on Jan 15 2026 10:44 AM

ఏం మామా.. బాగుండావా ?

ఏం మామా.. బాగుండావా ?

‘ఏం మామా.. బాగుండావా’ ఖతార్‌ దేశంలో ఉద్యోగం చేస్తూ రెండు రోజుల క్రితం సొంతూరుకు వచ్చిన ఓ ఎన్నారై తమ ఊళ్లోని రచ్చబండ వద్ద కూర్చున్న రైతును పలకరించాడు.

‘ఏం బాగులే అల్లుడూ.. ఎవరి లోకం వాళ్లదే అయింది. మాలాంటి రైతును పట్టించుకునే నాథుడే లేడు’ రైతు దీర్ఘంగా నిట్టూర్చాడు.

‘ఏంది మామా అట్టా అంటావ్‌.. మన మంచి ప్రభుత్వం రైతన్నను కంటికి రెప్పలా చూసుకుంటోంది కదా!’

‘ఎవరన్నారు సామీ.. అంత బాగా చూసుకుంటోందని’ రైతు ఆశ్చర్యంగా అడిగాడు.

‘మేము విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు మీడియాను ఫాలో అవుతుంటాం మామా. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోతుందని రోజూ వార్తల్లో చెబుతుంటారు మామా’ వివరించాడు ఆ ఎన్నారై.

‘అవి కొన్ని పచ్చ మీడియా సంస్థలు చేసే భజనలే కానీ వాస్తవం కాదు అల్లుడూ.. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు కుదేలవుతున్నారు సామీ.. ఎరువుల ధరలు అమాంతం పెరిగిపాయె. చివరకు ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి గోనెసంచి కొనాలంటే 40 రూపాయలు పెట్టాల్సి వస్తోంది. రైతు పరిస్థితి దయనీయంగా ఉందిలే సామీ..’ అంటూ రైతు మళ్లీ నిట్టూర్పు విడిచాడు.

‘ఏంటి మామా.. మన పల్లెల్లోని రైతులంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారని మేము అనుకుంటున్నాం. నీవేమో అంతా వట్టిదే అని బాధలు ఏకరువు పెడుతున్నావ్‌’

‘నేను చెప్పేది నిజం సామీ.. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి కొంచెం కూడా చిత్తశుద్ధి లేదు. అంతకు ముందు జగన్‌ రైతు భరోసా డబ్బులను ఠంచనుగా వేస్తుండేవాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత పోయినేడాది ఆ డబ్బు ఎగ్గొట్టేశాడు. ఈ ఏడాది అరకొర విదిలిస్తున్నాడు. యూరియా అస్సలు దొరకడం లేదు సామీ. యూరియా బస్తాలు దారి మళ్లి బ్లాక్‌ మార్కెట్‌కు చేరుతున్నాయి. ఫాస్పేట్‌ ఒక బస్తా గతంలో 1300 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1800 కు చేరింది. కానీ పండించిన ధాన్యం ధర మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. ప్రభుత్వం రైతును బొత్తిగా పట్టించుకోవడం లేదు సామీ. అయినా వ్యవసాయం దండగ అన్న ఈ ముఖ్యమంత్రి రైతులకు అండగా నిలబడతాడన్న ఆశ మాకు లేదులే సామీ’

‘సరే మామా.. కొడుకు ఎలా ఉన్నాడు? చిన్నప్పుడు వాడిని డాక్టర్‌ చేయాలని ఆశపడుతుంటివి. బాగా చదివిస్తున్నావా?’

‘ఇంకా ఎక్కడ డాక్టర్‌ సామీ.. జగన్‌ తెచ్చిన మెడికల్‌ కాలేజీలన్నీ చంద్రబాబు ప్రైవేట్‌ పరం చేసేసాడు. డాక్టర్‌ చదువులు మాలాంటి మధ్యతరగతి రైతులకు దూరమయ్యాయి. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చదివించే స్థోమత నాకు ఎక్కడిది అల్లుడూ.. నువ్వే చూస్తున్నావు కదా’

‘అవును మామా.. అది విచారకరమే. మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహిస్తే మనలాంటి రైతు బిడ్డలు ఎందరో అక్కడ చదువుకొని డాక్టర్లు అవుతారు. ఇప్పుడు పీపీపీ విధానంలో ఆ పరిస్థితి లేదు. నువ్వు చెప్పింది కరెక్టే మామా’

‘అన్నట్లు ఇంతకుమునుపు వచ్చినపుడు అత్తకు ఆరోగ్యం బాగాలేదన్నావ్‌.. ఇప్పుడెలా ఉంది మామా’

‘ఫర్వాలేదు సామీ.. మొన్న కాయిలా కాస్త ఎక్కువైతే హైదరాబాద్‌ తీసుకెళ్లాను. అక్కడ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ డబ్బులు సరిగా పడటం లేదట. నగదు చెల్లిస్తే ఆపరేషన్‌ చేస్తామని పెద్ద డాక్టర్‌ చెప్పారు. మనిషిని వదులుకోలేక ఐదు లక్షల రూపాయలు అప్పు చేసి ఆపరేషన్‌ చేయించా సామీ. ఇప్పుడిపుడే కోలుకొంటోంది.’

‘అవును మామా.. గతంలో ఆరోగ్యశ్రీ డబ్బులు వెంటనే పడుతుండేవి. ఇప్పుడు వైద్యం మొదలెట్టాలంటే ఆసుపత్రులు సైతం వెనకంజ వేస్తున్నాయి మామా’

‘ఒక్క రైతులే కాదు అల్లుడూ.. చంద్రబాబు చేతిలో అన్ని వర్గాలు మోసపోయాయి. డీఏలు సకాలంలో ఇవ్వలేదని, పీఆర్సీ ప్రకటించలేదని ఉద్యోగులు సర్కారుపై గుర్రుగా ఉన్నారు. ఉన్నత చదువుల వారికి ఫీజు రీయింబర్స్‌మంట్‌ డబ్బులు సరిగా పడటం లేదట. మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తానన్న హామీ గాలికెగిరి పోయింది. నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి మాటే ఎత్తడం లేదు. ఇలా ప్రతి ఒక్కరి పరిస్థితి దయనీయంగా ఉందిలే సామీ.. మీరేమో విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. మేమేమో ఇలా ఇబ్బందుల్లో కూరుకు పోతున్నాం. ఇంకేమైనా ఆ దేవుడు చల్లగా చూస్తే కాసింత కోలుకుంటాం తప్ప సర్కారు మీదైతే ఆశలు ఏమీ లేవు అల్లుడ్ఙూ అంటూ నెత్తిన రుమాలు బిగించి ఇంటిదారి పట్టాడు రైతు.

– మోపూరి బాలకృష్ణారెడ్డి (సాక్షి ప్రతినిధి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement