యూరియా... ఏదయా!
జిల్లావ్యాప్తంగా రబీ లక్ష్యం 1,39,796 హెక్టార్లు
కడప అగ్రికల్చర్: యూరియా కొరత రైతన్నను వేధిస్తూనే ఉంది. ఎక్కడా యూరియా కొరత లేకుండా చూస్తామంటున్న అధికారుల మాట ప్రకటనకే పరిమితమైంది. ఫలితంగా బస్తా యూరియా కోసం కర్షకలోకం తీవ్ర యుద్ధమే చేయాల్సి వస్తోంది. రైతు భరోసా కేంద్రాలు, మన గ్రోమోర్ సెంటర్ల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులన్నీ వదులకుని మండల కేంద్రాలబాట పట్టాల్సి వస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గులికలు కొంటేనే...
పలుచోట్ల డీలర్ల వద్ద అఽధిక ధర పెట్టి యూరియా కొందామంటే కావాల్సినన్ని అడిగినన్నీ బస్తాలు ఇవ్వడం లేదు. పైగా గులికలు కొంటేనే యూరియా ఇస్తామని మెలిక పెడుతున్నారని రైతులు ఆరోపించారు. అవసరం లేకున్నా గులికలు కొన్నాసరే ఒకటి రెండు బస్తాలనే ఇస్తున్నారని రైతులు తెలిపారు. అలాగే ధర కూడా పెంచి అమ్ముతున్నారని వాపోయారు. సాధారణంగా యూరియా బస్తా ఎమ్మార్పీ రూ. 270 ఉంటే పరిస్థితిని బట్టి బస్తాను రూ. 350 నుంచి రూ. 450 చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు తెలిపారు. ఈ అధిక ధరలను నియంత్రించే వారే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మరంగా వరినాట్లు...
జిల్లాలో రెండవ పంట కింద అన్నదాతలు ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. ముఖ్యంగా కేసీ కెనాల్‌తోపాటు నదీ పరివాహక ప్రాంతాలైన చాపాడు, చెన్నూరు, కడప, సిద్దవటం మండలాల్లో జోరుగా వరినాట్లు వేస్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే సాగు అయిపోయింది. మరికొన్ని చోట్ల సాగు కొనసాగుతోంది. దీంతోపాటు బోర్లు కింద కూడా వరినాటును ముమ్మరంగా సాగు చేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి సాధారణ సాగు 11,645 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2149 హెక్టార్ల వరకు సాగైంది.
వరిపంటకు దిగుబడి నాటికి మూడుసార్లు...
సాధారణంగా వరిసాగు చేసిన రైతులు వరి నాటిని 25 రోజులకు ఒకసారి, 50 రోజులకు ఒకసారి మరోసారి యూరియా వేస్తారు. వీటితోపాటు ఆరుతడి పంటలకు కూడా రెండు సార్లు, మూడు సార్లు వేస్తారు. రైతులకు యూరియా దొరకక పోవడంతో ముందు ముందు మళ్లీ యూరియా దొరకదేమోననే భయంతో రైతులు అవసరం లేకపోయినా ఒక్కొక్కరు మూడు, నాలుగు బస్తాలు తీసుకెళ్తున్నారు. గతంలో ఎప్పుడు యూరియా అవసరం ఉంటే అప్పుడే రైతులు షాపులకుగానీ , రైతు సేవా కేంద్రాలకుగాని వచ్చి తీసుకెళ్లేవారు. దీంతో అంత సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం యూరియా కొరత ఉండటంతో అందరూ ఒక్కసారిగా యూ రియా కోసం ఎగబడటంతో యూరియా కొరత వేధిస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌కు సంబంధించిన లక్ష్యం 1,39,796 హెక్టార్లుకాగా ఇప్పటి వరకు 88,753 హెక్టార్లలో వివిధపంటలు సాగయ్యాయి. ఇందులో శనగ 63,427 హెక్టార్లలో, మినుము 11,199 హెక్టార్లలో, మొక్కజొన్న 4667 హెక్టార్లలో, జొన్న 1726, సజ్జ 645 , వరి 2149 , పెసర 762, వేరుశనగ 1046, నువ్వులు 1543, పత్తి 222, సన్‌ఫ్లవర్ 301 హెక్టార్లలో సాగయ్యాయి.
జిల్లాను వేధిస్తున్న యూరియా కొరత
ఒక్క బస్తా కోసం రైతుల పడిగాపులు
అధిక ధరలకు అమ్ముతున్న డీలర్లు
పైగా గులికలు కొనాలని ఆంక్షలు
చోద్యం చూస్తున్న అధికారులు


