19న వేమన జయంతి వేడుకలు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో ఈ నెల 19వ తేదీ యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రజా సంబంధాల విభాగ సంచాలకులు డాక్టర్ పి.సరిత తెలిపారు. ఉదయం 11 గంటలకు విశ్వవిద్యాలయ అధికారులు యోగి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విశ్వవిద్యాలయంలోని నూతన పరిపాలనా భవనంలోని అన్నమాచార్య సెనేట్ హాల్‌లో సమావేశం జరుగుతుందన్నారు. గుంటూరుకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపాల్, కవి, ప్రముఖ పండితులు, సంగీతకారులు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు ఈ సభలో ప్రసంగిస్తారని వివరించారు.
కడప సెవెన్‌రోడ్స్: ముస్లింలు అత్యంత పుణ్యదాయకంగా భావించే షబ్– ఏ–మేరాజ్ సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి మసీదుల్లో భక్తులు ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. మత గురువులు ఈ సందర్భంగా పవిత్ర బడీరాత్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ముస్లింలు రాత్రంతా మసీదులు, ఇళ్లల్లో ప్రత్యేక నమాజ్‌లు, పవిత్ర ఖురాన్ పఠనం, అల్లాహ్ నామ స్మరణతో దైవాన్ని ప్రసన్నం చేసేందుకు ప్రయత్నించారు. తమ పాపాలను క్షమించాలని, స్వర్గ లోక ప్రాప్తి కల్పించాలని ఏకేశ్వరుడైన అల్లాహ్‌ను ప్రార్థించారు.
ములకలచెరువు: మిసెస్ ఇండియా విజేత అన్నమయ్య జిల్లా సంబేపల్లెకు చెందిన విజయలక్ష్మి కవ్వం శుక్రవారం ములకలచెరువు మండలంలో సందడి చేశారు. ములకలచెరువు మండలం గుండాలవారిపల్లెకు చెందిన ఆమె సమీప బంధువు శంకర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. అనంతరం బంధువు పంట పొలంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల ప్రాధాన్యత గురించి ఆమె వివరించారు.
కడప ఎడ్యుకేషన్: తెలుగు భాషోద్ధారకుడు సీపీ బ్రౌన్ నివసించిన స్థలంలో ఏర్పడిన బ్రౌన్ స్మారక గ్రంథాలయం గొప్ప జ్ఞానభాండాగా రమని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎల్‌వీ గంగాధర శాస్త్రి అన్నారు. గురువారం సి.పి.బ్రౌన్ గ్రంథాలయాన్ని తన శ్రీమతి అర్చనతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి లాంటి మహనీయుల కృషి ఫలితంగా వెలసిన గ్రంథాలయాన్ని సందర్శించడం ద్వారా తాను అమేయమైన ఆనందాన్ని పొందానన్నారు. తాళపత్రగ్రంథాలు, చేతితో తయారు చేసిన రాతప్రతులు, తామ్రపత్రం, నాణాలు లాంటి ప్రాచీన సంపదను కాపాడడం అభినందనీయమన్నారు. ఈ గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి విద్యార్థి దర్శించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సలహా మండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్, సహాయ పరిశోధకులు భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
19న వేమన జయంతి వేడుకలు


