వక్ఫ్ బిల్లును ఆమోదించింది.. కూటమి ప్రభుత్వమే
కమలాపురం: లోక్ సభ, రాజ్యసభలో ఎన్‌డీఏ ప్రభు త్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆమోదించిందని, అయితే ఆ బిల్లును రెండు సభల్లోనూ వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించిందని వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. కమలాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని పత్రికల్లో, పచ్చ మీడియాలో వైఎస్సార్‌సీపీ లోక్ సభలో వ్యతిరేకించి, రాజ్యసభలో మద్దతిచ్చిందని రావడం అసత్యం అన్నారు. వైఎస్సార్‌సీపీ రెండు సభల్లోనూ పూర్తిగా వ్యతిరేకించిందని ఆయన నొక్కి వక్కాణించారు. మహానేత వైఎస్సార్ ముస్లింల పక్షపాతి అని, ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించి వారికి విద్య, ఉపాధిలో స్థిరపడేలా చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. అలాగే ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముస్లింల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు ప్రతి మసీదులో ఇమాం, మౌజన్‌లకు జీతాలిచ్చే పద్ధతి తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు రెండు కళ్ల పద్ధతి పాటిస్తున్నారని, ఏపీలో ముస్లింల ఓట్లు దండుకుని, ఢిల్లీలో ముస్లింలు వ్యతిరేకిస్తున్న బిల్లుకు మద్దతు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఓటర్లను వాడుకొని వదిలేయడం చంద్రబాబు నైజమని ఊసరవెల్లిలా రంగులు మార్చే నాయకుడు ఆయనొక్కడే అన్నారు. వక్ఫ్ ఆస్తులకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. వక్ఫ్ ఆస్తులను తమ పార్టీ నాయకులకు, బినామీలకు కట్టబెట్టేందుకే చంద్రబాబు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నారన్నారు. బిల్లు ఇలా పాస్ అయిందో లేదో అప్పుడే వక్ఫ్ ఆస్తులను అభివృద్ధి చేయడానికి ఇష్టమున్న వారు ముందుకు రావాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరిట పత్రికల్లో ప్రకటనలు రావడం ఇందుకు నిదర్శనమని, మొబైల్ ఫోన్‌లో చూపిస్తూ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులు దోచేయడానికి టీడీపీ నాయకులు కుట్ర పన్నారని, బిల్లుకు ప్రజల ఆమోదం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పటికీ ముస్లింలకు బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, గంగాధర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి,మోహన్ రెడ్డి, కొండారెడ్డి, ఆర్‌వీఎన్‌ఆర్, లక్ష్మీ నారాయణరెడ్డి, జగన్ మోహన్‌రెడ్డి, గఫార్, ఖాజా హుసేన్, జిలాని, ఆచారి, జనార్థన్ రెడ్డి, ఆంజనేయరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జెట్టి నగేష్, శ్రీరాం రమణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆ బిల్లుకు ప్రజల ఆమోదం లేదు
వక్ఫ్ ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం లేదు
కాపాడుకోవాల్సిన బాధ్యత ముస్లింలపై ఉంది
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి


