హౌసింగ్‌ అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ | Sakshi
Sakshi News home page

హౌసింగ్‌ అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ

Published Sun, Dec 17 2023 11:56 PM

-

రాయచోటి : హౌసింగ్‌ శాఖలో ఇంటి దొంగల గుట్టు రట్టు అవుతోంది. ఎండ్రకాయ్‌ బలుపు ఎక్కితే బొరకలో ఉండదు అన్న పెద్దల సూక్తిని నిజం చేస్తూ హౌసింగ్‌ శాఖలో పేదల సొమ్మును బొక్కిన అధికారులు పంపకాల్లో తేడా వచ్చిందో.. లేక బొక్కేసిన డబ్బును దాచుకోలేకపోయారో.. తెలియదు కానీ అవినీతి చేపల బాగోతం రోడ్డెక్కింది. ఫలితంగా అన్నమయ్య జిల్లాలో అవినీతి చేసిన అధికారులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి పేద మధ్య తరగతి ప్రజలందరికీ పక్కా ఇళ్లను నిర్మించాలన్న సంకల్పానికి కొంత మంది అధికారులు తూట్లు పొడుస్తున్నారు. పక్కా భవనం పునాది నుంచి ఇల్లు పూర్తయ్యే వరకు హౌసింగ్‌ శాఖలోని కొంత మంది ఉద్యోగులు మామూళ్లు ముట్టందే సహకరించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నమయ్య జిల్లా పరిధిలోని ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉన్న అధికారులపై కడప ఏసీబీ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్‌ 6వ తేదీన కేసు నమోదు చేశారు. కేసులో నిందితులుగా ఉన్న అధికారులను ఈ నెల 21వ తేదీన విచారించేందుకు జిల్లా పోలీస్‌ అధికారుల అనుమతి కూడా పొందినట్లు సమాచారం. జిల్లా పరిధిలోని రాయచోటి, రాజంపేట, పీలేరు ప్రాంతాలలోని అటెండర్లు, డీటీపీ ఆపరేటర్ల అకౌంట్లు, ఫోన్‌ పేల ద్వారా లక్షలాది రూపాయలను క్షేత్రస్థాయిలోని ఉద్యోగులు, సిబ్బంది నుంచి మామూళ్ల రూపంలో రాబట్టినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం ఉంది. ముఖ్యంగా జిల్లాలోని జగనన్న కాలనీల నిర్మాణాలలో ఇసుక, కడ్డీలు, సిమెంట్‌ను లబ్ధిదారులకు ఇవ్వకుండానే పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులకు అందించిన వాటిలో సగం సిబ్బంది నొక్కేసి వాటి ద్వారా వచ్చిన సొమ్ములో ఉన్నతాధికారులకు వాటాలు పట్టించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. హౌసింగ్‌ అధికారుల అవినీతి పెచ్చుమీరడంపై స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా హౌసింగ్‌ శాఖలో జరుగుతున్న అవినీతిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఇళ్లను నిర్మిస్తున్న లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సామగ్రిని, బిల్లులను అందజేసి ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కేసు నమోదు

జిల్లా హౌసింగ్‌ పీడీ ఆఫీస్‌లో శనివారం జరిగిన సంఘటనపై వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ హరి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. అదే శాఖలోని హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నామని సీఐ చెప్పారు.

కింది స్థాయి ఉద్యోగుల నుంచి రూ.లక్షలు వసూళ్లపై ఆరా

క్లర్కులు, అటెండర్‌ల ఫోన్‌పేలు, బ్యాంక్‌ అకౌంట్ల పరిశీలన

వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదు

Advertisement
Advertisement