ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య | IIIT Student Committed Suicide In Idupulapaya - Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Sep 20 2023 2:12 AM | Updated on Sep 20 2023 1:24 PM

- - Sakshi

అర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న ఎన్‌.గంగరామ్‌ (21) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

వైఎస్సార్: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ అర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న ఎన్‌.గంగరామ్‌ (21) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. లింగాల మండలం తేర్నాంపల్లి గ్రామానికి చెందిన ఎన్‌.గంగాధర్‌, నారాయణమ్మ దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ఎన్‌.గంగరామ్‌ ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ఇంజినీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

చిన్నకుమారుడు గౌరిశంకర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం భోజనానంతరం తోటి విద్యార్థులు తరగతి గదులకు వెళ్లగా.. గంగరామ్‌ క్యాంపస్‌లోని హాస్టల్‌ గదిలో ఉండి, ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 4 గంటల ప్రాంతంలో పక్కగదిలో ఉన్న విద్యార్థి తలుపు తట్టగా ఎంతసేపటికీ పలకకపోవడంతో వెనుక ఉన్న కిటికీ నుంచి తొంగిచూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.

వెంటనే ట్రిపుల్‌ ఐటీ అధికారులకు విద్యార్థులు తెలియజేశారు. పోలీసులు, ట్రిపుల్‌ ఐటీ అధికారులు, డైరెక్టర్‌ సంధ్యారాణి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్యాన్‌కి వేలాడుతున్న గంగారామ్‌ను కిందికి దించి ట్రిపుల్‌ ఐటీలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement