మోత్కూరు: మోత్కూరు మండల పరిధిలోని రాకాసి బోళ్ల సమీపంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు బయల్పడ్డాయి. మట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పురావస్తు పరిశోధనలో డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్‌రెడ్డి, ఎడ్ల నరేష్, వెంకటేష్, మొలగూరి శ్రీను బృందం వీటిని సోమవారం గుర్తించింది. ఈ సందర్భంగా పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మోత్కూరులోని రాకాసి బండ, నాగుల బండ, కత్వ బండ తదితర పరుపు రాతి బండలపై నవీన శిలాయుగం నాటి రాతి పనిముట్లను తయారు చేసేందుకు వినియోగించిన ఆనవాళ్లను గుర్తించినట్లు తెలిపారు. పురావస్తు పరిభాషలో వీటిని గ్రూవ్స్ అంటారని వివరించారు. రాకాసి బోళ్ల ప్రాంతంలో శిస్తు సమాధులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ సమాధుల్లో రాతి పలకలను సగం భూమిపైన, సగం భూమి లోపల అమర్చి, వాటిపై పెద్ద బండరాయిని కప్పుగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలలో అనేక సమాధులు ధ్వంసమయ్యాయని అన్నారు. కాగా, ఇటీవల ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు అందుకున్న రెడ్డి రత్నాకర్రెడ్డిని విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల నరేష్‌తో పాటు అన్నెపు భాస్కర్, కోమటి అనిల్ కుమార్, కొలిపాక ఉప్పలయ్య, బోయిని వెంకన్న తదితరులు ఘనంగా సన్మానించారు.
వెలుగులోకి తెచ్చిన
మట్టి ఫౌండేషన్ బృందం


