రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ దుర్మరణం

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

యాదగిరిగుట్ట : సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్‌ మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపి న వివరాల ప్రకారం.. తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన పల్లపు మహేందర్‌ (28) జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్‌ ప్రాంతంలో ఆర్మీ జవాన్‌గా సేవలందిస్తున్నారు. మహేందర్‌ 20 రోజుల క్రితం సొంత గ్రామమైన కొండాపురానికి వచ్చాడు. సోమవారం పని నిమిత్తం బైక్‌పై సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండల కేంద్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. జగదేవ్‌పూర్‌ మండలం పీర్లపల్లి గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

పెద్దఅడిశర్లపల్లి : రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్‌ ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాశిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని భారత్‌పురం గ్రామానికి చెందిన శీలం ప్రభాకర్‌రెడ్డి(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ప్రభాకర్‌రెడ్డి అంగడిపేట ఎక్స్‌ రోడ్డు వద్దకు వెళ్లి చికెన్‌ తీసుకొని తిరిగి కాలినడకన స్వగ్రామానికి వెళ్తుండగా.. పెద్దఅడిశర్లపల్లి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులోకి రాగానే బైక్‌ ఢీకొట్టింది. దీంతో ప్రభాకర్‌రెడ్డి రోడ్డుపై పడిపోయారు. చికిత్స నిమిత్తం అతడిని 108 అంబులెన్స్‌లో దేవరకొండకు తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు హనుమంతురెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నం

● సైరన్‌ మోగడంతో పరారైన దొంగలు

నకిరేకల్‌(చిట్యాల): మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో హైదరాబాద్‌–విజయవాడ హైవే పక్కనే ఉన్న సాయిబాబా ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చోరీకి యత్నించారు. ఆలయం ముందు వైపు ఉన్న గ్రిల్స్‌ తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అయితే, ఆలయంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన అలారం పెద్దగా మోగడంతో దొంగలు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ బీరెల్లి వెంకట్‌రెడ్డి ఆలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఆలయంతో పాటు హైవే వెంబడి ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చికిత్స పొందుతూ మృతి

హుజూర్‌నగర్‌(నేరేడుచర్ల) : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. నేరేడుచర్ల ఎస్‌ఐ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి గ్రామానికి చెందిన పగిళ్ల అంజయ్య(66), యడవల్లి నరసయ్య శనివారం నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో రెడ్డిపల్లి ఎల్లమ్మ అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం నరసయ్య ద్విచక్ర వాహనంపై ఇద్దరూ తిరిగి గరిడేపల్లికి బయల్దేరారు. మర్గమధ్యలో నేరేడుచర్లలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు రాగానే ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొని కిందపడ్డారు. ఈ ప్రమాదంలో నరసయ్య ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న పగిళ్ల అంజయ్య పక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతిచెందాడు. నరసయ్య ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య జానకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement