విద్యుత్ కనెక్షన్ల వివరాలు ఇలా..
ఈహెచ్‌టీ సబ్ స్టేషన్లు 07
33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు 101
33 కేవీ ఫీడర్స్ 62
33కేవీ లైన్(కిలోమీటర్లు) 1184.25
11కేవీ ఫీడర్స్ 475
11కేవీ లైన్(కిలో మీటర్లు) 8221.86
ఎల్‌టీ లైన్(కిలో మీటర్లు) 16828.78
మొత్తం డీటీఆర్‌ఎస్ 37906
అన్ని రకాల కనెక్షన్లు 4,65,924
వ్యవసాయ కనెక్షన్లు 1,22,820
ప్రస్తుతం గృహజ్యోతి లబ్ధిదారులు 1,53,403
భువనగిరి: పెరుగుతున్న అవసరాల దృష్ట్యా జిల్లాలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా విద్యుత్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన కరెంటు అందించేందుకు వీలుగా కొత్త సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు పలు చోట్ల 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పనులను ప్రారంభించారు. జిల్లాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ డిమాండ్ ఏటేటా పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా అన్ని రకాల కనెక్షన్లు కలిపి 4 లక్షలకు పైగా ఉన్నాయి. వీటికి విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థలో కీలకమైన సబ్‌స్టేషన్ల సంఖ్య పెరిగితే ప్రజలకు మరింత మెరుగైన కరెంటు సరఫరా అందనుంది.
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. శీతాకాలంలో విద్యుత్ వినియోగం తగ్గాల్సి ఉన్నప్పటికీ, సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో డిమాండ్ అలాగే కొనసాగుతోంది. దీనికి తోడు రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో రూ. 121.50 కోట్లతో పలు పనులు ప్రతిపాదించగా, కొన్ని పనులు ఇప్పటికే మొదలయ్యాయి. రూ. 65 కోట్లతో ఇరవై 33/11 కేవీ సబ్ స్టేషన్లు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 7 పూర్తయ్యాయి. మరో 13 నిర్మాణ దశలో ఉన్నాయి. రూ. 10 కోట్లతో పన్నెండు 33 కేవీ విద్యుత్ లైన్లు మంజూరయ్యాయి. రూ. 11 కోట్లతో 44 (11 కేవీ) విద్యుత్ లైన్ల పనులు చేపట్టనున్నారు. రూ. 10 కోట్లతో అన్ని రకాల 251 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. రూ. 2.50 కోట్లతో అవసరమైన ప్రాంతాల్లో అదనపు సామర్థ్యం కలిగిన 90 ట్రాన్స్‌ఫార్మర్లను బిగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ. 23 కోట్లతో అదనపు సామర్థ్యం కలిగిన 15 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు.
పెరుగుతున్న డిమాండ్ మేరకు..
పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మంజూరు చేసిన ఈ నిధులతో, వేసవి కాలం ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సబ్‌స్టేషన్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతుండగా, మిగిలిన పనులను సైతం త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా విద్యుత్ వినియోగదారులకు కరెంటు సమస్యలు శాశ్వతంగా తీరనున్నాయి.
విద్యుత్ డిమాండ్ మేరకు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులురాకుండా కొత్తగా సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. రాబోయే వేసవి కాలం నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– సురేష్‌కుమార్, విద్యుత్ ఎస్‌ఈ
రూ.121.50 కోట్లతో విద్యుత్ వ్యవస్థ బలోపేతం
ఫ భవిష్యత్ అవసరాల కోసం కొత్తగా 20.. 33/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణం
ఫ వేసవి ప్రారంభం నాటికే పనులన్నీ పూర్తి చేసే దిశగా విద్యుత్ శాఖ కసరత్తు


