మూడు రోజులకు ఒక సారి నీటి సరఫరా
సాక్షి, యాదాద్రి : భువనగిరి మున్సిపాలిటీలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ఒకవైపు నీటి ఎద్దడి తలెత్తకుండా పొదుపుగా వాడుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు పట్టణంలో యథేచ్ఛగా సాగుతున్న అక్రమ నల్లా కనెక్షన్ల వ్యవహారం మున్సిపాలిటీ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతోంది. అనధికారిక కనెక్షన్లు, వాణిజ్య సముదాయాల్లో జరుగుతున్న నీటి అక్రమ వినియోగంపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మున్సిపాలిటీ ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి.
వ్యాపార సముదాయాల్లో గృహ కనెక్షన్లు
పట్టణంలో భారీ షాపింగ్ మాల్స్, అపార్ట్‌మెంట్‌లు, హోటళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు విపరీతంగా వెలిశాయి. నిబంధనల ప్రకారం వీరు కమర్షియల్ నల్లా కనెక్షన్లు తీసుకుని నెలకు రూ.500 పన్ను చెల్లించాలి. కానీ, మున్సిపల్ రికార్డుల్లో కేవలం 128 కమర్షియల్ నల్లాలే ఉన్నాయి. మిగతావన్నీ గృహావసరాల కనెక్షన్ల (నెలకు రూ.100 పన్ను) ద్వారానో, అనధికారిక కనెక్షన్ల ద్వారానో నీటిని వాడుకుంటూ ఖజానాకు కన్నం వేస్తున్నాయి.
అధికారుల కాకిలెక్కలు..
మున్సిపాలిటీ పరిధిలో సుమారు 15,600 అసెస్‌మెంట్లు ఉండగా, రికార్డుల్లో అధికారిక నల్లా కనెక్షన్లు 10,226 మాత్రమే ఉన్నట్లు చూపిస్తుండటం గమనార్హం. పట్టణంలోని 35 వార్డుల పరిధిలో కనీసం 13 వేలకు పైగా కనెక్షన్లు ఉండే అవకాశం ఉన్నా, అధికారుల వద్ద ఉన్న లెక్కలు ఎక్కడా సరిపోలడం లేదు. దీన్నిబట్టి పట్టణంలో అనధికారిక నల్లాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు 2005, 2013 రోడ్డు విస్తరణ సమయంలో తొలగించిన నల్లాల డిమాండ్లను ఇప్పటికీ రికార్డుల్లో నుంచి తీసివేయకపోవడంతో పాత బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి.
భువనగిరి పట్టణంలోని సుమారు 79వేల జనాభా దాహార్తి తీర్చడానికి ప్రతిరోజూ 11.5 ఎంఎల్‌డీల మంచినీరు అవసరం. కానీ, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ ద్వారా 5.5 ఎంఎల్‌డీలు, 180 బోర్‌బావుల ద్వారా 3.5 ఎంఎల్‌డీలు కలిపి మొత్తం 9 ఎంఎల్‌డీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. నీటి కొరత కారణంగా ఒక రోజు నీటి సరఫరా చేస్తే, మళ్లీ మూడో రోజు కానీ సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమ నల్లా కనెక్షన్లను అరికట్టాలని, వాణిజ్య నల్లాల నుంచి పూర్తి పన్ను వసూలు చేసి పట్టణంలో తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని భువనగిరి ప్రజలు కోరుతున్నారు.
భువనగిరిలో నల్లా కనెక్షన్లలో అక్రమాలు
ఫ కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ఫ తప్పుడు లెక్కలతో కాలయాపన
ఫ రూ.కోట్లలో ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీ
నల్లా
కనెక్షన్ల వివారాలు


