టార్గెట్‌.. వందశాతం హాజరు | - | Sakshi
Sakshi News home page

టార్గెట్‌.. వందశాతం హాజరు

Nov 10 2026 2:36 AM | Updated on Nov 10 2026 2:36 AM

సవాలుగా మారిన పండుగలు,

వ్యవసాయ పనులు

రామన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నవంబర్‌ నెలను ‘నూరుశాతం హాజరు మాసోత్సవం’గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌) ద్వారా ఆన్‌లైన్‌ హాజరు నమోదవుతున్న నేపథ్యంలో, ఈ నెలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నూరుశాతం ఉండేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

పకడ్బందీగా ఆన్‌లైన్‌ హాజరు విధానం

జిల్లాలో మొత్తం 656 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 40,777 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతంలో మాదిరిగా కాగితాలకే పరిమితం కాకుండా ముఖ గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) హాజరును విద్యాశాఖ తప్పనిసరి చేసింది. ఉపాధ్యాయులకు సంబంధించి ఈ యాప్‌లో ఎలాంటి కారణం లేకుండా గైర్హాజరు అని చూపే అవకాశం ఉండదు. సెలవులో ఉన్నా, ఆన్‌డ్యూటీలో ఉన్నా స్పష్టంగా నమోదు చేయాల్సిందే.

అధికారుల నిరంతర పర్యవేక్షణ

ప్రభుత్వం చేపట్టిన ఈ మాసోత్సవం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల వాస్తవ నమోదుపై స్పష్టత రానుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు వంద శాతం హాజరు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కుటుంబ పనులు, వ్యవసాయ పనుల కారణంగా బడికి రాని విద్యార్థుల జాబితాను రూపొందించి, నేరుగా వారి ఇళ్లకే వెళ్తున్నారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లలను బడికి రప్పించేలా చొరవ చూపుతున్నారు. ప్రతి పాఠశాల వారం వారం హాజరు ప్రగతిని నమోదు చేయాల్సి ఉండగా.. జిల్లా విద్యాశాఖాధికారి, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు దీనిని నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పత్తి ఏరే పనులు సాగుతున్నాయి. దీంతో చాలా చోట్ల హైస్కూల్‌ విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పొలాలకు వెళ్తున్నారు. దీనికి తోడు ఇదే నెలలో దీపావళి, కేదారేశ్వర వ్రతాలు, నోములు, గృహ ప్రవేశాలు, వివాహాలకు శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దీపావళి నోములు ఉన్న ఇళ్లలో నాలుగైదు రోజుల పాటు సందడి ఉంటుంది. ఇలాంటి పండుగలు, పనుల కారణంగా ఈ నెలలోనే విద్యార్థులు ఎక్కువగా గైర్హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిబంధకాలను అధిగమించి, నూరుశాతం హాజరు లక్ష్యాన్ని చేరుకోవడం విద్యాశాఖకు, ఉపాధ్యాయులకు కొంత కష్టతరంగానే మారింది.

ఫ నవంబర్‌ నెలను ‘నూరుశాతం హాజరు మాసోత్సవం’గా ప్రకటించిన విద్యాశాఖ

ఫ విద్యార్థులను బడికి రప్పించేందుకు వారి ఇళ్ల వద్దకే వెళ్తున్న ఉపాధ్యాయులు

ఫ వారం వారం ప్రగతిపై డీఈఓ, ఎంఈఓల నిరంతర పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement