ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి
భువనగిరిటౌన్ : ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పెండింగ్ పెట్టకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి అర్జీదారుల నుంచి 49 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు ప్రాధాన్యమివ్వాలన్నారు. రెవెన్యూ శాఖకు 27, సర్వే ల్యాండ్స్ 4, పంచాయతీరాజ్ 3, నీటిపారుదల శాఖ 3, మున్సిపాలిటీ 3, మండల పరిషత్ 2, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ, ఉపాధి కల్పన, గనులు, విద్య, రవాణా, పంచాయతీ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ పాల్గొన్నారు.
రెవెన్యూ పెండింగ్
సమస్యలను పరిష్కరించాలి
సాక్షి, యాదాద్రి : జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సమక్షంలో రెవెన్యూ అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా, ప్రాజెక్టుల వారీగా భూసేకరణ పురోగతిని పరిశీలించారు. భూసేకరణకు సంబంధించి పీఎన్, పీడీ, అవార్డు జారీ, పరిహారం చెల్లింపులు, భూముల స్వాధీనం, సేకరించిన భూముల వివరాలను భూభారతి పోర్టల్‌లో నమోదు చేసిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ట్రిపుల్ ఆర్ పరిహారం చెల్లింపుల్లో లబ్ధిదారుల వారీగా ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారందరికీ పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బునాదిగాని కాలువ పరిహారం చెల్లింపుల పురోగతిని గ్రామాల వారీగా సమీక్షించి, పెండింగ్ చెల్లింపులను వేగవంతం చేయాలన్నారు. భూభారతి పోర్టల్‌లో పాత, కొత్త పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, రీ–సర్వే పురోగతి, ఎస్‌ఐఆర్, ఎమ్మెల్సీ పెండింగ్ క్లెయిమ్స్, జీఓ 59 కింద ఉన్న దరఖాస్తులపై చర్చించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.


