రాయితీ కంటే ఖర్చే ఎక్కువ | - | Sakshi
Sakshi News home page

రాయితీ కంటే ఖర్చే ఎక్కువ

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా..

పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈనెల 16 వరకు గడువు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా సాధారణ ఫీజు రూ.125లు చెల్లించాలి. అనంతరం రూ.50 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 1 వరకు, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 14 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్‌ 28 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

భువనగిరి: ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఊరటనివ్వాల్సిన పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీ ఆచరణలో అక్కరకు రావడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న 100 శాతం ఫీజు రాయితీని పొందడానికి కఠినమైన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. కేవలం రూ.125ల పరీక్ష ఫీజు మినహాయింపు పొందేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రవాణా, ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ.260 వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో రాయితీ పొందడం కంటే బడిలోనే నిబంధనల గోల లేకుండా ఫీజు చెల్లించడమే మేలని పేద విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

పాత ఆదాయ పరిమితులతో ఇబ్బందులు

ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలుగా ఉంది. అయితే పదో తరగతి పరీక్ష ఫీజు రాయితీకి మాత్రం పాత జీవోలోని నిబంధనలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి రూ.20 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.22 వేలుగా ఉండటంతో మెజారిటీ విద్యార్థులు అర్హత సాధించలేకపోతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తక్షణమే ఈ ఆదాయ పరిమితులను సవరించాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పదో తరగతి విద్యార్థులు 5,248 మంది

జిల్లా వ్యాప్తంగా మొత్తం 715 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో పదో తరగతి విద్యార్థులు ఉన్న పాఠశాలలు 175 ఉండగా, వీటిలో మొత్తం 5,248 మంది పది విద్యార్థులు చదువుతున్నారు. ఫీజు రాయితీ పొందాలంటే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పొందేందుకు మీ సేవా కేంద్రాల్లో ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.80 చొప్పున మొత్తం రూ.160 చెల్లించాలి. వీటికి తోడు ప్రయాణ చార్జీలు, జీరాక్స్‌, ఫొటోలు వంటి ఖర్చులకు మరో రూ.100 వరకు అవుతున్నాయి. దీంతో మొత్తం రూ.260 వరకు వ్యయం అవుతుండటంతో, రూ.125 ఫీజు మినహాయింపు కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం పేద కుటుంబాలకు భారంగా మారింది.

ఫ టెన్త్‌ పరీక్ష ఫీజు రూ.125 రాయితీ పొందేందుకు రూ.260 ఖర్చు

ఫ సర్టిఫికెట్లు, రవాణా ఖర్చుల రూపంలో అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి

ఫ రాయితీ కంటే ఫీజు చెల్లించడమే మేలంటున్న తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement