రామగిరి (నల్లగొండ) : అన్నెపర్తి 12వ బెటాలి యన్‌లో వారం రోజుల పాటు నిర్వహించిన యువ ఆపదమిత్ర రెండో బ్యాచ్ శిక్షణ సోమవారం ముగిసింది. ఈ శిక్షణలో నల్లగొండ, భువనగిరి ప్రాంతాలకు చెందిన 42 మంది మహిళలు, 18 మంది పురుషులు భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం అందించడంలో యువ ఆపదమిత్ర సభ్యుల పాత్ర కీలకమన్నారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను కేవలం శిక్షణకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆపద వచ్చినప్పుడు వినియోగించాలని సూచించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న 60 మంది సభ్యులను అభినందించారు. కమాండెంట్ బి. రామకృష్ణ మాట్లాడుతూ.. యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా యువ ఆపద మిత్ర శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న సభ్యులకు అభినందన పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, మహేందర్, దేవేందర్, డాక్టర్ షర్మిలా దేవి, నితిన్ గౌతమ్ పాల్గొన్నారు.


