విత్తనాలను ఉచితంగా సరఫరా చేస్తాం
పశుగణన వివరాలు
గ్రాసం కొరత నివారణకు రూ.3.13 కోట్లతో కార్యాచరణ
సాక్షి, యాదాద్రి : వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సంక్షోభాన్ని తట్టుకుని మూగజీవాలను కాపాడుకునేందుకు జిల్లా పశుసంవర్ధక శాఖ ముందస్తు పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగింది. కరువు కాలంలో గ్రామీణ రైతు కుటుంబాలకు అండగా నిలిచి పాడి రక్షణే ధ్యేయంగా సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. జిల్లాలోని మొత్తం 17 మండలాల్లో 11 కరువు మండలాలను గుర్తించి 5.54 లక్షల పశువులకు తాగునీరు, దాణా, గ్రాసం విత్తనాలు అందించేందుకు రూ.3.13 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
భారీగా పచ్చి, ఎండుగడ్డి లోటు
జిల్లాలో 2026 నవంబర్ నుంచి 2027 ఆగస్టు వరకు రాబోయే పది నెలల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పశుసంవర్ధక శాఖ క్షేత్రస్థాయి అవసరాలను లెక్కగట్టింది. జిల్లాలోని 11 కరవు మండలాల పరిధిలోని 307 గ్రామాల్లో మొత్తం 5,54,224 పశువులు కరవు ప్రభావానికి లోనవుతున్నట్లు అధికారిక లెక్కలు తేల్చాయి. ఈ పది నెలల కాలానికి జిల్లాకు మొత్తం 48,62,565 క్వింటాళ్ల ఎండుగడ్డి అవసరం కాగా, ప్రస్తుతం 46,19,437 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే 2,43,128 క్వింటాళ్ల లోటు కనిపిస్తోంది. అదేవిధంగా పచ్చిగడ్డి లభ్యత మరింత ఆందోళనకరంగా మారింది. మొత్తం 29,17,539 క్వింటాళ్ల అవసరానికి గాను కేవలం 23,34,031 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఏకంగా 5,83,508 క్వింటాళ్ల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం రైతులు వరి, జొన్న, మొక్కజొన్న చొప్పతో పాటు కందులు, పెసలు, శనగలు, వేరుశనగ పంటల అవశేషాలపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నాయి. సాధారణంగా క్వింటా ఎండుగడ్డి ధర రూ. 600 ఉండగా ప్రస్తుతం రూ. 650కి పెరిగింది. క్వింటా పచ్చిగడ్డి ధర రూ.300 నుంచి రూ. 350కి చేరింది. దీంతో పాడి పోషణ భారమై పాల ఉత్పత్తి పడిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.3.13 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు
జిల్లాలో మేత, తాగునీటి సమస్యలు రాకుండా శాఖ సిద్ధం చేసిన రూ. 3.13 కోట్ల నివేదికలో అన్ని విభాగాలకు సమతుల్య కేటాయింపులు చేశారు. మూగజీవాల దాహర్తిని తీర్చేందుకు ఉపాధి హామీ నిధులతో 289 గ్రామాల్లో 289 కొత్త తాగునీటి తొట్ల నిర్మాణానికి రూ.144.50 లక్షల నిధులను ప్రతిపాదించారు. కరువు ప్రభావం ఉన్న 307 గ్రామాల్లోని 30 వేల మంది పాడి రైతులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రూ.105 లక్షల వ్యయంతో 3,000 మెట్రిక్ టన్నుల పశుదాణా సరఫరాకు నివేదించారు. అదేవిధంగా 307 గ్రామాల్లోని 800 మంది రైతులకు 40 మెట్రిక్ టన్నుల గడ్డి జొన్న విత్తనాలు అందించేందుకు రూ.33.90 లక్షలు, రైతులు పశుగ్రాసాన్ని వృథా చేయకుండా కత్తిరించి సమర్థంగా వినియోగించుకోవడానికి 50 గ్రామాల్లోని 50 మంది రైతులకు రూ.20 లక్షల విలువైన 50 చాఫ్ కట్టర్లను సరఫరా చేయాలని నిర్ణయించారు. వీటితోపాటు పశువుల్లో పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలను నివారించడానికి ఐదు వేల మంది రైతులకు రూ.10 లక్షల వ్యయంతో 100 మెట్రిక్ టన్నుల ఖనిజ లవణాల మిశ్రమాన్ని (మినరల్ మిక్చర్) ఉచితంగా సరఫరా చేయాలని ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు.
ఫ 11 కరువు మండలాల్లో 5.54 లక్షల మూగజీవాల రక్షణే ధ్యేయం
ఫ తాగునీరు, దాణా, విత్తనాల
సరఫరాకు పశుసంవర్ధక శాఖ సమగ్ర నివేదిక సిద్ధం
గ్రామాల్లోని ప్రభుత్వ స్థలాలు, చెరువు శిఖాల్లో ఉమ్మడిగా పశుగ్రాసం సాగు చేసేందుకు సర్పంచులు ముందుకు వస్తే మా శాఖ తరఫున కమ్యూనిటీ ఫాడర్ ప్లాట్లు ఏర్పాటు చేయడానికి సహకారం అందిస్తాం. ఈ ఉమ్మడి సాగుకు అవసరమైన మేలురకం విత్తనాలను రైతులకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తాం. ఇప్పటికే జిల్లాలోని 17 మండలాల్లో 41 మెట్రిక్ టన్నుల విత్తనాలు పంపిణీ చేశాం.
–డాక్టర్ డి.శ్రీనాథ్,
పశుసంవర్ధక శాఖ ఇన్‌చార్జ్ అధికారి
జిల్లాలో భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, మోత్కూరు, మోటకొండూరు, భూదాన్ పోచంపల్లి, రాజాపేట, రామన్నపేట, తుర్కపల్లి, వలిగొండ, యాదగిరిగుట్ట మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించారు. వలిగొండ మండలంలో అత్యధికంగా 70,543 పశువులు మేత కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆ తర్వాత భూదాన్ పోచంపల్లిలో 68,583, రామన్నపేటలో 63,942, భువనగిరిలో 56,215, బీబీనగర్‌లో 52,830 పశువులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 3.30 లక్షల లైవ్‌స్టాక్ యూనిట్లు ఉండగా, అందులో 67,144 తెల్ల పశువులు (ఆవులు, ఎద్దులు), 1,07,444 గేదెలు, 5,45,295 గొర్రెలు, 1,23,242 మేకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


