భువనగిరి : తెలంగాణ సమగ్ర శిక్షా, పీఎం శ్రీ పథకాల కింద 2026–27 విద్యా సంవత్సరానికి మంజూరైన నిధులను జిల్లా పాఠశాల స్థాయిలో సకాలంలో ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం తీవ్రంగా స్పందించింది. మంజూరైన నిధులను నిర్ణీత సమయంలో ఖర్చు చేయకపోవడంతో జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారం పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి నిధుల వినియోగంపై సమీక్షించారు. శనివారం అధికారులు పీఎం శ్రీ పాఠశాలలను సందర్శించి, మంజూరైన నిధులు, వాటిని ఖర్చు చేయకపోవడానికి గల కారణాలను నివేదిక రూపంలో తయారు చేసి రాష్ట్ర స్థాయి అధికారులకు పంపనున్నారు. జిల్లాలోని 20 పీఎం శ్రీ పాఠశాలలకు మొత్తం రూ.3.26 కోట్లు మంజూరు కాగా, అందులో ప్రస్తు తం 50 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యాయి.
రూ.3.26 కోట్లు మంజూరు
పీఎం శ్రీ పాఠశాలలకు మంజూరైన నిధుల్లో ఇప్పటివరకు 15 శాతంలోపే ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. వివిధ పథకాల కింద ఈ ఏడాది జూలైలో రూ.3.26 కోట్లు మంజూరు కాగా, ఇతర పథకాల కింద మరిన్ని నిధులు మంజూరయ్యాయి. విడుదలైన నిధుల్లో ఇప్పటి వరకు కేవలం రూ. 40.18 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు.


