ఫ రూ.9.87 కోట్ల వ్యయంతో నిర్మాణం ఫ 30న భూమిపూజకు సన్నాహాలు ఫ ఒకేసారి 1,500 మంది భక్తులు పాల్గొనేలా ఏర్పాటు
యాదగిరిగుట్ట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో నూతన కల్యాణ మండపం నిర్మాణానికి సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఈ కల్యాణ మండపానికి ఈ నెల 30వ తేదీన భూమిపూజ చేసేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైటీడీ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ) ధర్మకర్తల మండలి ఏర్పాటైన తర్వాత కొండపైన మొదటిసారిగా ఒక పెద్ద అభివృద్ధి కార్యక్రమానికి అడుగులు పడుతున్నాయి.
ప్రస్తుతం ప్రథమ ప్రాకార మండపంలో..
యాదగిరి క్షేత్రానికి వచ్చే భక్తులు శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకునేందుకు విశేష ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం ఈ నిత్య కల్యాణోత్సవాన్ని ఆలయ ప్రాంగణంలోని దక్షిణ దిశలో ఉన్న ప్రథమ ప్రాకార మండపంలో నిర్వహిస్తున్నారు. రోజూ సుమారు 75 నుంచి 100కి పైగా జంటలు ఈ వేడుకలో పాల్గొంటున్నాయి. అయితే, భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో విశాలమైన మండపం అవసరమని అధికారులు గుర్తించారు. గతంలో మైహోమ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ మండపాన్ని నిర్మించేందుకు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీతో శంకుస్థాపన కూడా చేయించారు. కానీ, ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల వల్ల ఆ సంస్థ పనులు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ఎం.సత్యనారాయణరెడ్డి కల్యాణ మండలం నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చారు.
రూ.9.87 కోట్లతో అధునాతన నిర్మాణం
శ్రీస్వామివారి నిత్య కల్యాణోత్సవం కోసం వైటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ఎం.సత్యనారాయణరెడ్డి తన సొంత నిధులు రూ.9.87 కోట్లతో కల్యాణ మండపాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. యాదగిరి క్షేత్ర సన్నిధిలో జరిగిన ధర్మకర్తల మండలి రెండవ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పూర్వపు బాలాలయం ఉన్న ప్రదేశంలోనే ఈ నూతన కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు ఈ నెల 30న భూమిపూజ నిర్వహించనున్నారు. అధునాతన హంగులతో, సువిశాలమైన ప్రాంగణంలో ఒకేసారి 1,500 మంది భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని తిలకించేలా దీనిని తీర్చిదిద్దనున్నారు.
ఏడాదిలోపే అందుబాటులోకి..
యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంఆవరణలో కల్యాణ మండపం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఇటీవల నిర్మాణ సంస్థతో వైటీడీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిర్మాణ పనులను 9 నుంచి 12 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలని అధికారులు, వైటీడీ ధర్మకర్తల మండలి లక్ష్యంగా పెట్టుకున్నాయి. వచ్చే ఏడాది నాటికి భక్తులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు చైర్మన్ ఎం.సత్యనారాయణరెడ్డి తెలిపారు.


