టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం | - | Sakshi
Sakshi News home page

టెండర్ల ఖరారులో తీవ్ర జాప్యం

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

ఫ రూ.30కోట్లున్నా ముందుకుసాగని అభివృద్ధిపనులు

ఫ ప్రతిపాదన దశల్లోనే డ్రెయినేజీలు, అంతర్గత రోడ్లు, పార్కు, ఓపెన్‌జిమ్‌

ఆలేరు: ఖజానాలో కోట్ల నిధులున్నా... ఆలేరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ప్రతిపాదనల దశలోనే మూలుగుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకమండలి ఊదాసీనత .. వెరసి 12 వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వస్తే మురుగుమయమయ్యే రోడ్లు, ఉప్పొంగే ఓపెన్‌ నాలాలు, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులతో నిత్యం అవస్థలు పడుతున్నారు. నిధులున్నా టెండర్ల ఖరారులో జాప్యం.. పట్టణ ప్రగతికి శాపంగా మారింది.

12 వార్డుల్లో పడకేసిన మౌలిక వసతులు

మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల్లో మౌలిక వసతుల కొరత తీవ్రస్థాయికి చేరింది. ఎక్కడ చూసినా దెబ్బతిన్న రోడ్లు, అధ్వానమైన డ్రెయినేజీలు దర్శనమిస్తున్నాయి.

కాగితాలకే పరిమితం

పట్టణ సమస్యల పరిష్కారానికి నిధులైతే మంజూరయ్యాయి కానీ, పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీయూఎఫ్‌ఐడీసీ) స్కీమ్‌ కింద రూ.15 కోట్లు మంజూరయ్యాయి.గత ఏడాది చివర్లో సీఎం రేవంత్‌రెడ్డి నగరాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మరో రూ.15 కోట్లను కేటాయించారు. మొత్తం రూ.30 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా అధికారులు టెండర్ల ప్రక్రియ పేరుతో కాలయాపన చేస్తుండటంతో పనులకు మోక్షం లభించడం లేదు.

ప్రతిపాదనలు ఇవీ..

నగరాభివృద్ధి కింద కేటాయించిన రూ.15 కోట్లతో చేపట్డాల్సిన పనులకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వివిధ వార్డుల్లో వరద నీటి నివారణ కాల్వల నిర్మాణానికి రూ.9 కోట్లు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ.4 కోట్లు, బృందావన్‌ కాలనీలో మున్సిపల్‌ పార్కుకు రూ. కోటి, పర్రె కాల్వ వద్ద కల్వర్టు నిర్మాణానికి రూ.75 లక్షలు, ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటుకు రూ.25 లక్షలు కేటాయించారు.

మూడేళ్లుగా మరుగునపడ్డ మున్సిపల్‌ భవనం!

మరోవైపు టీయూఎఫ్‌ఐడీసీ పథకం కింద రూ.15 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీల నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కొలనుపాక మార్గంలోని పాత పంచాయతీ కార్యాలయం వద్ద రూ.3 కోట్లతో నూతన మున్సిపల్‌ భవన నిర్మాణానికి ప్రతిపాదించారు. మూడేళ్లు కావొస్తున్నా టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు అడుగు కూడా ముందుకు పడలేదు. వార్డుల్లో కనీస వసతులు కల్పించేందుకు అధికారులపై ఒత్తిడి పెంచి పనులు ప్రారంభించేలా చేయడంలో పాలకమండలి అలసత్వం ప్రదర్శిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement