సాయంత్రానికే ఫలితాలు ..
సాక్షి, యాదాద్రి : జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. మానవత్వం, స్వచ్ఛంద సేవ లక్ష్యాలుగా పనిచేసే రెడ్‌క్రాస్ డైరెక్టర్ల పదవుల కోసం జరుగుతున్న ఎన్నికలు సాధారణ రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. మొత్తం 15 డైరెక్టర్ పోస్టుల కోసం 22 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అభ్యర్థులు రెండు ప్యానెళ్లుగా విడిపోయి ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. కొందరు అభ్యర్థులకు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలుపుతూ లోపాయికారీగా ప్రచారం నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
సోషల్ మీడియాలో ముమ్మర ప్రచారం
ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. ఓటర్లకు నేరుగా ఫోన్లు చేస్తూనే వాట్సాప్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వేదికగా పోస్టులు పెడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జిల్లా రెడ్‌క్రాస్‌లో మొత్తం 2,036 మంది ఓటర్లు ఉండగా, గత రెండు నెలల వ్యవధిలోనే వెయ్యికి పైగా కొత్త సభ్యత్వాలు నమోదు కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సేవా దృక్పథం కంటే ఆధిపత్యం కోసమే పోటీ పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్యానెల్ తరఫున ప్రచారం చేస్తున్నప్పటికీ, వ్యక్తిగత ప్రాధాన్యతతో తమకే ఓటు వేయాలని పలువురు అభ్యర్థులు కోరుతుండటం గమనార్హం.
పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఈనెల 4న జరిగే ఎన్నికల కోసం నిర్వహణ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాయగిరి జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు రెడ్‌క్రాస్ సొసైటీ ఐడీ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మొత్తం 24 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.
పోలింగ్ ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 4 కౌంటింగ్ టేబుళ్ల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఫలితాలు వెల్లడైన వెంటనే.. గెలుపొందిన 15 మంది డైరెక్టర్లు చేతులెత్తే పద్ధతి ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్, ట్రెజరర్, స్టేట్ బాడీ మెంబర్ వంటి నాలుగు కీలక పదవులను ఎన్నుకుంటారు. అనంతరం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా డీపీఓ శ్రీనివాస్‌రెడ్డి, అబ్జర్వర్‌గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు వ్యవహరిస్తున్నారు.
ఫ తారాస్థాయికి చేరిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ పాలకవర్గ ఎన్నికల పోరు
ఫ రెండు ప్యానెళ్లుగా విడిపోయి ప్రచారం సాగిస్తున్న అభ్యర్థులు
ఫ రేపు రాయగిరి జెడ్పీహెచ్‌ఎస్‌లో పోలింగ్
ఫ ఓటు హక్కు వినియోగించుకోనున్న 2,036 మంది ఓటర్లు


