భువనగిరి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి మండలంలోని బస్వాపూర్ రిజర్వాయర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ నయీం పాషా(39) తన ఇద్దరు స్నేహతులతో కలిసి ఆదివారం బస్వాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకున్నాడు. రిజర్వాయర్‌లో చేపలు పట్టేందుకు వారు నీటిలోకి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక నయాం కాలుకు తాడు చుట్టుకోవడంతో ఈత కొట్టలేకపోయాడు. ఈ క్రమంలో నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు అందజేసిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ బృందాల సాయంతో పాషా మృతదేహాన్ని గాలించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ అనిల్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


