చెర్వుగట్టు.. అగ్నిగుండం! | - | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టు.. అగ్నిగుండం!

Jul 27 2026 3:06 AM | Updated on Jul 27 2026 3:06 AM

షార్ట్‌ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు.. 17 దుకాణాలు దగ్ధం

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు అగ్నిగుండంగా మారింది. ఆదివారం తెల్లవారు జామున పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ఘాట్‌ రోడ్డుకు ఎదురుగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణా సముదాయంలో ఓ షాపు ఎదుట ఉన్న రేకుల షెడ్డుకు కరెంటు స్తంభం నుంచి వచ్చే తీగల ద్వారా షార్ట్‌సర్క్యూట్‌ అయింది. దీంతో ఒక దుకాణం నుంచి మరో దుకాణానికి మంటలు అంటుకుని మొత్తం 17 దుకాణాలు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.3కోట్ల ఆస్తి నష్టం కలిగింది. కళ్లెదుటే ప్లాస్టిక్‌ సామగ్రి బుగ్గిపాలవుతుండడంతో షాపుల నిర్వాహకులు ఏమీ చేయలేదని నిస్సహాయ స్థితిలో మిగిలారు.

తెల్లవారుజామున ఓ వ్యక్తి గమనించడంతో..

రంగా శ్రవణ్‌ అనే దుకాణాదారుడు ఆదివారం తెల్లవారు జామున మూత్రవిసర్జన కోసం లేచాడు. షాపు ఎదుట బొమ్మల సామగ్రికి మంటలు చెలరేగడం గమనించాడు. తక్షణమే ఇంటి వెనకాల ఉన్న వారికి ఫోన్‌ చేసి నిచ్చెన సాయంతో బయటికి వచ్చారు. ఆ దుకాణం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మికి సమాచారం ఇవ్వడంతో వారు వెనుక నుంచి బయటకు వచ్చేశారు. వరాల సతీష్‌ అనే వ్యక్తి సర్పంచ్‌ నేతగాని కృష్ణ, పలువురి దుకాణదారులకు విషయం తెలపడంతో వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులకు, ఫైరింజన్‌ సిబ్బందికి సమాచారం అందించారు. నల్లగొండ, నార్కట్‌పల్లి సీఐలు ఆదిరెడ్డి, సుధాకర్‌, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని దుకాణాదారులను అప్రమత్తం చేశారు. ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే దుకాణల్లో ఉన్న సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘటనలో దాదాపు రూ.3 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, జేసీ ప్రేమ్‌కుమార్‌, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులందరికీ తక్షణ సాయంగా ఎమ్మెల్యే వేముల వీరేశం రూ.20వేల చొప్పున అందజేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందేవిధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మొరాయించిన ఫైరింజన్‌

చెర్వుగట్టులో ప్రమాద ఘటనకు సంబంధించిన సమాచారం ఇచ్చిన 45 నిమిషాలకు నల్లగొండ నుంచి వచ్చిన ఫైరింజన్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఈక్రమంలో ఫైరింజన్‌ మొరాయించింది. అప్పటికే మంటలు ఎక్కువై సమీపంలో ఉన్న అన్ని దుకాణాలకు మంటలు వ్యాపించాయి. తక్షణమే నకిరేకల్‌, రామన్నపేట నుంచి వచ్చిన ఫైరింజన్‌తో అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు కృషి చేశారు.

30 ఫీట్లు ముందుకు జరగడం వల్లే ప్రమాదం!

గ్రామ పంచాయతీ నుంచి లీజుకు తీసుకున్న షటర్‌ నుంచి దుకాణాదారులు దాదాపు 30 ఫీట్లు ముందుకు రేకులు ఏర్పాటు చేసుకున్నారు. ఈక్రమంలో కరెంట్‌ స్తంభం నుంచి షాపులకు వచ్చిన కరెంట్‌ తీగలు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో ప్రథమంగా రేకుల షెడ్డులో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ కవర్లకు అంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

రూ.3 కోట్ల ఆస్తి..

కట్టుబట్టలతో మిగిలిన బాధితులు

కళ్లెదుటే బుగ్గిపాలవుతున్నా

ఏమీ చేయలేని నిస్సహాయత

తెల్లవారకముందే.. కాలిపోయిన కలలు

అధికారుల నిర్లక్ష్యం వల్లే షాపులు దగ్ధం

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. సంఘటన జరిగిన వెంటనే ఫైరింజన్‌ సిబ్బంది, పోలీసులు సంఘటనా చేరుకుంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని అన్నారు. ఫైరింజన్‌ సకాలంలో రాకపోవడం, తీరా వచ్చాక ఫైరింజన్‌ మొరాయించడంతో ప్రమాదం నష్టం భారీగా జరిగిందని తెలిపారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement