ప్రత్యామ్నాయ పంటలు శరణ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలు శరణ్యం

Jul 27 2026 3:06 AM | Updated on Jul 27 2026 3:06 AM

గుర్రంపోడు, హుజూర్‌నగర్‌ : ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలంలో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాభావ పరిస్ధితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన జొన్న, కంది, పెసర్లు, మినుములు, కంది, పొద్దు తిరుగుడు, ఆముదం పంటలు సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి సూచిస్తున్నారు.

కంది

జూలై చివరి వారం వరకు కంది విత్తనాలు విత్తుకోవచ్చు. ఆలస్యంగా ఆగస్టు మొదటి వారం వరకు కూడా కొన్ని స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు.

జొన్న

ఖరీఫ్‌లో జూన్‌ నుంచి జూలై చివరి వరకు జొన్న పంటను సాగు చేయొచ్చు. వర్షాధారంగా ఈ పంట సాగు ఎంతో అనుకూలం. తక్కువ నీటితో సాగవుతుంది. ఎండను తట్టుకునే పంట, పశువులకు మంచి పశుగ్రాసం కూడా లభిస్తుంది. వర్షాధాన ప్రాంతాల్లో వరికి ప్రత్యామ్నాయంగా జొన్న మంచి ఎంపిక.

ఆముదం

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఆముదం వరికి మంచి ప్రత్యామ్నాయం. జూలై నెలాఖరు వరకు తగిన వర్షం కురిసినప్పుడు విత్తుకోవచ్చు. ప్రారంభ దశలో తేమ అవసరం కాగా తర్వాత తక్కువ నీటితో పంట బాగా పెరుగుతుంది.

అపరాలు

ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాల పంటలైన పెసర్లు, మినుములు సాగుకు అనుకూలం. జూలైలో కురిసే వర్షాలకు విత్తుకోవచ్చు. తక్కువ నీటితో సాగుతోపాటు నేలలో నత్రజని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి.

నువ్వులు

నువ్వుల పంటను ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకు విత్తుకోవచ్చు. ఇందులో శ్వేత, రాజేశ్వరి, జెసీఎస్‌ 1020 అనే రకాలు మంచి దిగుబడులనిస్తాయి. నువ్వులను విత్తుకునేటప్పుడు రైతులు సాలుకు సాలుకు మధ్య 30 సెంటీ మీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీ మీటర్లు ఉండేలా విత్తుకోవాలి.

మొక్కజొన్న

మొక్కజొన్న సాగు చేయాలనుకునే రైతులు జూలై 31 వరకు సాగు చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే మొక్కజొన్న రకాలలో స్వల్పకాలిక రకాన్ని ఎంచుకోవడం మంచిది. చిరుధాన్యాలైన సజ్జ, రాగి, కొరన్రు ఆగస్టు 15 వరకు విత్తుకోవచ్చు.

ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి

హుజూర్‌నగర్‌ : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో వరి సాగు కష్టతరమవుతుందని, రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని హుజూర్‌నగర్‌లోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ఆపత్కాల పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement