చిట్యాల: వికారాబాద్‌కు చెందిన అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఠాగూర్ శంకర్ సింగ్ రాష్ట్ర స్థాయి కథల పోటీల్లో చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన డాక్టర్ సాగర్ల సత్తయ్య రచించిన కథ ఉత్తమ పురస్కారానికి ఎంపికై ంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సేవా సదనంలో ఆదివారం నిర్వహించిన దాశరథి, సినారే జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సత్తయ్య పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నగదుతో పాటు ప్రశంసాపత్రం అందజేసి సత్తయ్యను సన్మానించారు. కార్యక్రమంలో అనంత సాహిత్య వేదిక వ్యవస్థాపకులు దోరవేటి, తుల్జారాం సింగ్ ఠాగూర్, బీపీ నర్సింహులు గుప్తా, గంటా మనోహర్‌రెడ్డి, తలారి ఆశీర్వాదం, కమేలేష్, మహమ్మద్ షరీఫ్, వడిచర్ల సత్తయం, కడియాల మధుసూదన్‌రావు, జానకి రామారావు, కోల్లా భాస్కర్‌రావు పాల్గొన్నారు.
బీబీనగర్ మండల వాసికి కార్మికరత్న అవార్డు
భువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలానికి చెందిన కార్మిక నాయకుడు గాదె నరేందర్‌రెడ్డి జాతీయ కార్మికరత్న అవార్డు అందుకున్నారు. కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ఆయన చేసిన కృషికిగాను ఆదివారం హైదరాబాద్‌లోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ పాల్గొన్నారు.
తాజ్‌పూర్ గ్రామ వాసికి ఆదర్శ స్వర్ణనంది అవార్డు
భువనగిరి: మండలంలోని తాజ్‌పూర్ గ్రామానికి చెందిన సామాజికవేత్త, ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ అధినేత ర్యాకల శ్రీనివాస్ ఆదర్శ స్వర్ణనంది అవార్డు అందుకున్నారు. ఆయన చేసిన సామాజిక సేవకుగాను హైదరాబాద్‌కు చెందిన ఆదర్శ కళానిలయం వారు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈసందర్భంగా ఆదివారం యాదరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చేతులమీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత
రాజాపేట : అక్రమంగా వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. రాజాపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఫోర్ వీలర్ వాహనాన్ని తనిఖీ చేయగా 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయని ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపారు. ఈమేరకు రేణికుంట గ్రామానికి చెందిన జగదీష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.


